Share News

గుట్టువిప్పింది ఎవరు?

ABN , Publish Date - Apr 17 , 2024 | 05:20 AM

ఎన్నికలబాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించి, రద్దుచేసిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ పథకాన్ని వెనకేసుకొస్తూ...

గుట్టువిప్పింది ఎవరు?

ఎన్నికలబాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించి, రద్దుచేసిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ పథకాన్ని వెనకేసుకొస్తూ వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. సుప్రీంకోర్టులో వాదోపవాదాలు సాగుతున్నప్పుడూ, చివరకు తీర్పు వెలువడిన తరువాత కూడా బీజేపీ నాయకులు ఈ పథకాన్ని మించినదేదీలేదని అంటూనే ఉన్నారు. తీర్పువచ్చిన రోజు రవిశంకర్‌ ప్రసాద్‌ విలేఖరులతో చేసిన వ్యాఖ్యలు వినగానే విపక్షకాంగ్రెస్‌కు అనుమానం వచ్చి, కొత్త కుట్రలకు తెరదీయకండి అని హెచ్చరించింది కూడా. అయినా కూడా అనంతరం ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగిన మాట అటుంచితే, నితిన్‌గడ్కరీ, అమిత్‌షా ఇత్యాది మంత్రుల వరుసలోనే ప్రధానమంత్రి కూడా రద్దయిన ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని మెచ్చుకుంటూ రెండు ఇంటర్వ్యూల్లో సుప్రీంకోర్టు తీర్పును పరోక్షంగా తప్పుబట్టారు. దేశాన్ని మళ్ళీ నల్లధనంలోకి నెట్టేశామని వాపోయారు, రాబోయేరోజుల్లో ప్రతీ ఒక్కరూ పశ్చాత్తాపపడాల్సివస్తుందని శపించారు.

రేపటిరోజుల్లో నిజాయితీగా, గుండెలమీద చేయివేసుకొని ఆలోచిస్తే, ఈ పథకం రద్దయినందుకు ఈ దేశంలోని ప్రతీ ఒక్కరూ ఎంతో బాధపడేరోజులు వస్తాయట. ప్రతిపక్షాలను అడ్డుపెట్టుకొని ఈ పథకం రద్దుమీద ఆయన చేసిన విమర్శలన్నీ ఒక విధంగా సుప్రీంకోర్టును దృష్టిలో పెట్టుకొని చేసినవే. ఎన్నికలబాండ్లు ఉన్నందువల్లనే డబ్బు ఎవరినుంచి ఎవరికి చేరుతున్నదో తెలుస్తున్నదని, అవి లేనప్పుడు ధనప్రవాహం గతిని ఎవరైనా తేల్చిచెప్పగలరా? అని ఆయన మొన్న ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న వేశారు. గతంలో ఒక తమిళచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ఆయన తాను ఈ బాండ్ల పథకాన్ని తెచ్చినందువల్లనే రాజకీయ విరాళాల మూలాలు, ముచ్చట్లు తెలుస్తున్నాయని అన్నారు. కానీ, ఆ గుట్టు విప్పింది సుప్రీంకోర్టే తప్ప, తాను తెచ్చిన పథకం దాతలు స్వీకర్తల వివరాలు రహస్యంగా ఉంచేందుకే తయారైందని ఆయనకు మాత్రం తెలియదా? ప్రజలకే కాదు, చివరకు ఎన్నికల సంఘానికి కూడా దాతల వివరాలు రహస్యమే. బాండ్లు అమ్మిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను బాండ్ల వివరాలు చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశిస్తే, అది చివరివరకూ గుట్టువిప్పకుండా విఫలయత్నాలు చేసిన విషయం తెలిసిందే. బ్యాంకును, ఎన్నికల సంఘాన్ని ముడిపెట్టి, సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలతో వెంటపడితే తప్ప రహస్యం బద్దలై ఆ వివరాలు ప్రజాక్షేత్రంలోకి ప్రవహించలేదు.

ఎన్నికల బాండ్ల రూపకల్పనలోనే పారదర్శకు పాతరేశారు, గోప్యతకు పెద్దపీటవేశారు. అందుకే, గత ఆరేళ్ళకాలంలో ఏ పార్టీకి ఏ దాత ఎంతిచ్చాడన్న కనీసం ఒక్క లావాదేవీ కూడా ఈ దేశప్రజలకు తెలియలేదు. ఈ రాజకోట రహస్యాన్ని బద్దలు కొట్టేందుకు ఆర్టీఐ ద్వారా ప్రయత్నించినా విఫలమయ్యేట్టుగా విధానం రూపుదిద్దుకుంది. పాలకపక్షం నేతలు ఈ పథకాన్ని ప్రశంసిస్తూ, సమర్థించుకుంటూ చేసిన వ్యాఖ్యలన్నీ అసత్యాలు, అర్థసత్యాలే. ఈ పథకం లేకపోవడంతో ఇకమీదట రాజకీయ విరాళాల్లో నల్లధనం ప్రవహించేస్తుందని మోదీ, అమిత్‌షాలు తెగవాపోతున్నారు. కానీ, అంతవరకూ రాతకోతలు, చిట్టాపద్దులు, బ్యాంకులావాదేవీలతో అత్యంత పారదర్శకంగా ఉన్న 2013నాటి ‘ఎలక్టోరల్‌ ట్రస్ట్‌’ విధానం స్థానంలోకి ఈ బాండ్లు వచ్చిన తరువాతే, నల్లధనం తెల్లరంగుపులుముకొని, అడ్డుతోవలో రాజకీయపార్టీల ఖజానాల్లోకి చేరుకుంది. స్వదేశీ, విదేశీ కంపెనీలన్న తేడాలేకుండా, వాటి ఆదాయ వ్యయాలతోనూ లాభనష్టాలతోనూ నిమిత్తం లేకుండా ఎంతైనా దానం చేయగలిగే వెసులుబాటు ఇచ్చి మరీ రహస్యంగా విరాళాలు గుంజుకున్నారు. పన్నెండు లక్షల లాభాన్ని ఆర్జించిన ఒక కంపెనీ కేవలం రెండునెలల్లో 195కోట్లు కేంద్రంలోని అధికారపక్షానికి విరాళం ఇవ్వడం, ఒక లాటరీ నిర్వహణ సంస్థ, ఒక గేమింగ్‌ సంస్థ తమ వార్షికలాభానికి ఐదేసి, పదేసిరెట్లు దానం చేయడం, బాండ్లు కొన్నవారు ఈడీ బడితెపూజలనుంచి బయటపడటం వంటి చాలా రహస్యాలు సుప్రీంకోర్టు చొరవతోనే దేశప్రజలకు తెలిసొచ్చింది. ఎన్నికలవేళ ఈ బాండ్ల బాగోతం అధికారపక్షం పరువు తీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీపథకం అని విపక్షాలు చేస్తున్న విమర్శలను అటుంచితే, ఈ పథకం ద్వారా జరిగిన క్విడ్‌ప్రోకో బాగోతాలన్నింటి మీదా సర్వోన్నత న్యాయస్థానం ఒక సమగ్రవిచారణకు ఆదేశించడం అత్యావశ్యకం.

Updated Date - Apr 17 , 2024 | 05:21 AM