Share News

నేరం ఎవరిది?

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:07 AM

హత్రాస్ దేశమంతటికీ తెలిసిన పేరు. నాలుగేళ్ల కిందట అక్కడ ఒక దళిత అమ్మాయి అత్యాచారం, హత్య జరిగాయి. దోషులు అగ్రకులానికి చెందినవారు. ఎంతగా నిరసన వ్యక్తమైనా, ప్రభుత్వం చర్య తీసుకోవడానికి...

నేరం ఎవరిది?

హత్రాస్ దేశమంతటికీ తెలిసిన పేరు. నాలుగేళ్ల కిందట అక్కడ ఒక దళిత అమ్మాయి అత్యాచారం, హత్య జరిగాయి. దోషులు అగ్రకులానికి చెందినవారు. ఎంతగా నిరసన వ్యక్తమైనా, ప్రభుత్వం చర్య తీసుకోవడానికి గాని, తీసుకున్నట్టు కనిపించడానికి కానీ సిద్ధపడలేదు. ఇప్పుడు, మరొక విషాదానికి హత్రాస్ కేంద్రమయింది. ఒక దళిత కుటుంబంలో సూరజ్ పాల్‌గా పుట్టి, నారాయణ్ సకాల్ హరి అలియాస్ భోలే బాబాగా ప్రసిద్ధుడయిన ఒక బాబా పాదధూళి కోసం మంగళవారం నాడు జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. మరో ముప్పై మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో 112 మంది మహిళలే. ఇప్పుడు కూడా ప్రభుత్వం, అదే ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ఎటువంటి కఠిన చర్య తీసుకోవడానికి సిద్ధంగా లేదు. బాబా మీద కేసే లేదు. ప్రభుత్వ యంత్రాంగం ప్రాణనష్టానికి ఎటువంటి బాధ్యతా తీసుకోవడం లేదు. అక్కడ భక్తుల సమావేశం (సత్సంగ్) నిర్వహించిన వారు ఆరుగురి మీద మాత్రం కేసు పెట్టారు. ఇదంతా అలక్ష్యం వల్ల, వైఫల్యం వల్లా జరగలేదని, ఏదో కుట్ర ఉండి ఉండవచ్చునని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. న్యాయవిచారణకు కూడా ఆదేశించారు.


భోలేబాబా మధుర, ఆగ్రా, హత్రాస్ పరిసర ప్రాంతాలలో బాగా ప్రసిద్ధుడు. ఈ సంఘటన తరువాత, డేరా బాబా వంటి వారితో ఈయన పేరును కలిపి చెబుతున్నారు కానీ, ఈయన పెద్ద హంగామా ఉన్న బాబా కాదు. భక్తులు మాత్రం దళితులతో పాటు, ఇతర కులాల్లో కూడా ఉన్నారు. ఈ బాబాను సమీపించడమే కష్టం అని చెబుతారు. మంచిచెడుల గురించి బోధనలు చేస్తాడని, వ్యసనాలకు దూరంగా ఉండాలని ఉపదేశిస్తాడని భక్తులు చెబుతున్నారు. ఈయన గత చరిత్రలో ఏమన్నా నేరాలు, ఘోరాలు ఉన్నాయా అని పోలీసులు, మీడియా పరిశోధనలు చేశారు కానీ, పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసి స్వచ్ఛంద విరమణ చేసిన ఈ సూరజ్‌పాల్ మీద దాదాపు పాతికేళ్ల కిందట ఒక కేసు నమోదయింది. చనిపోయిన ఒక బాలికను బతికిస్తానని చెప్పి, ఖననం చేసిన శవాన్ని వెలికి తీయించిన అభియోగం అది. అప్పుడు ఆయన మీద ఆ నేరారోపణ ఉంది కానీ, తన సత్సంగ్‌లలో బాబా ఎటువంటి మాయమంత్రాలు ప్రదర్శించడని భక్తులు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు, మానసిక కలవరాలు ఆయన మాటలు వింటే తొలగిపోతాయని, మనశ్శాంతి దొరుకుతుందని వాళ్లు నమ్ముతున్నారు. ఇన్నిమరణాలకు కారణమైన సంఘటనలో బాబా నేరమేమీ లేదని, సొంతవారిని కోల్పోయిన భక్తులు కూడా వాదిస్తున్నారు.

ఎనభై వేల మంది హాజరవుతారని చెప్పిన సమావేశానికి రెండు లక్షల ముప్పైవేల మంది వచ్చారు. సమావేశ స్థలం పక్కన బురద నేల ఉంది. వర్షం వచ్చేట్టు ఉన్నదని వాతావరణ సూచన ఉన్నా, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కారులో వెడుతున్న బాబాను అందుకోవడానికో, కారు కింది మట్టిని ముట్టుకోవడానికో భక్తులు ఎగబడిపోయారు. అదుపుతప్పింది. సమావేశంలో క్రమశిక్షణ కోసం నిర్వాహకులు నియమించుకున్న వలంటీర్లు చేతులెత్తేశారు. ఏదో ప్రమాదం జరిగిందని పసిగట్టిన వెంటనే బాబా అక్కడి నుంచి పారిపోయాడు.


ఇప్పుడు నేరం ఎవరిదని చర్చ. బాబాను కేసులో చేర్చడానికి ప్రభుత్వం సంకోచిస్తున్నది. అతనికి ఉన్న ప్రజాదరణ రీత్యా ఆ సంకోచం సహజమే కావచ్చు. మరో పక్క, దేశవ్యాప్తంగా బాబా మీద చర్య కోసం డిమాండ్ పెరుగుతున్నది. ఇటువంటి జనసమీకరణలో, కార్యక్రమ నిర్వాహకుల బాధ్యత ఎంత, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత ఎంత అన్న చర్చ కూడా అవసరం. రెండు లక్షలమందికి పైగా ఒక చోట గుమిగూడినప్పుడు, అక్కడ అవాంఛనీయ పరిస్థితులు నివారించడానికి ప్రభుత్వమే కల్పించుకోవడం ఆనవాయితీ. సమస్యల మీద గొంతెత్తే ప్రజలు నలుగురు గుమిగూడితే చాలు, పరిగెత్తుకువచ్చే పోలీసులు ఇంత జనసమ్మర్దాన్ని ఎట్లా వదిలేస్తారు? పరిస్థితిని అదుపు చేయడంలోను, త్వరితగతిన చెదరగొట్టి, వైద్య సదుపాయాలు అందించడంలోను వైఫల్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అంగీకరించాలి.

అనుమతి పొందిన సంఖ్య కంటె ఎక్కువ మంది గుమి గూడడం, నిర్వాహకులు బాధ్యతారహితంగా ఉండడం వంటివి సాంకేతిక అంశాలు. ప్రభుత్వ యంత్రాంగం పాత్ర కూడా జవాబుదారీతనానికి సంబంధించినది. అసలు సమస్య, ఎందుకు అంత మంది అటువంటి బాబాలకు భక్తులవుతున్నారు? అతని వంటి వారి మాటల నుంచి, వారిని నమ్మడం నుంచి ప్రజలకు కలుగుతున్న ఉపశమనమేమిటి? వ్యవస్థాగతమైన, పాలనాపరమైన ఏ లోపాల నుంచి, ఏ జీవన సంక్షోభాల నుంచి ప్రజలు బాబాలను ఆశ్రయిస్తున్నారు? అవధులు దాటిన ఈ బాబా భక్తి వెనుక ఉన్న సామాజిక, మానసిక ధోరణులేమిటి? వీటిని శోధించాలి. అతనిని చూడడంలో, వినడంలో, చివరికి ధూళిని అందుకోవడంలో ఆ ప్రజలు చూపిన ఆత్రుత, తపన ఆశ్చర్యకరమైనవి. ప్రభుత్వాల నుంచి, వ్యవస్థల నుంచి పొందిన ఆశాభంగాలే, వారిని గుడ్డినమ్మకాల వైపు తరుముతున్నాయి. ఇటీవల తమిళనాడులో కల్తీ మద్యం తాగి పెద్ద సంఖ్యలో మరణించడానికి, ఈ తొక్కిసలాటకీ పెద్ద తేడా లేదు. రెండూ తరుణోపాయం కోసం ప్రజల ప్రయత్నంలో జరిగిన ప్రమాదాలే.

Updated Date - Jul 05 , 2024 | 07:06 AM