Vijay: విజయ్ గెలిచేనా...
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:13 AM
జమిలి ఎన్నికల ఆలోచన ఉపసంహరించుకోవాలని, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)నుంచి తమిళనాడు బయటకు రావాలని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా తమిళనాట కులగణన ఊసెత్తకపోవడం ఇత్యాదివి ఈ తీర్మానాల్లో ఉన్నాయి. కేంద్రం తెస్తున్న వక్ఫ్‌బిల్లుకు వ్యతిరేకంగానూ, రాష్ట్రంలో ద్విభాషా విధానమే ఉండాలనీ, హిందీకి రాష్ట్రంలో చోటులేదంటూ కూడా తీర్మానాలు జరిగాయి. అధికారంలోకి..
సినీరంగం నుంచి రాజకీయరంగంలోకి ప్రవేశించిన మరో తమిళ నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆదివారంనాటి కార్యవర్గ సమావేశంలో పాతికకుపైగా తీర్మానాలు చేసింది. కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ, రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకె) లక్ష్యంగా ఈ తీర్మానాలు ఉన్నాయి. జమిలి ఎన్నికల ఆలోచన ఉపసంహరించుకోవాలని, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)నుంచి తమిళనాడు బయటకు రావాలని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కూడా తమిళనాట కులగణన ఊసెత్తకపోవడం ఇత్యాదివి ఈ తీర్మానాల్లో ఉన్నాయి. కేంద్రం తెస్తున్న వక్ఫ్‌బిల్లుకు వ్యతిరేకంగానూ, రాష్ట్రంలో ద్విభాషా విధానమే ఉండాలనీ, హిందీకి రాష్ట్రంలో చోటులేదంటూ కూడా తీర్మానాలు జరిగాయి. అధికారంలోకి వచ్చేందుకు స్టాలిన్ అబద్ధపు హామీలు ఇచ్చారని, ప్రజలను మోసం చేశారని కూడా ఆ పార్టీ తప్పుబట్టింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్టీ ఆరంభం నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత, కొద్దినెలలపాటు వ్యవహారం వేగం పుంజుకోలేదు కానీ, ఇటీవల విజయ్ తన జోరుపెంచారు. వారం క్రితం పార్టీ ప్రారంభ మహాసభ లక్షలమందితో కిటకిటలాడిపోయింది. గ్లామర్ ఉన్న నటులకు అభిమానులతోపాటుగా ఆ పాటి జనం రాకపోరన్నమాట నిజమే కానీ ఆ సభను ఎంతో పకడ్బందీగా, క్రమశిక్షణతో నిర్వహించడం విశేషం. విజయ్‌లో మంచి వక్త ఉన్నాడని ఆ సభ రుజువుచేసింది. అనవసరపు పంచ్ డైలుగులు, అర్థంలేని ఆవేశపూరిత వ్యాఖ్యలు లేకుండా ఆకట్టుకొనే రీతిలో చక్కని ప్రసంగం చేశారు. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకెని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించారు. దానిని మతతత్వ ఫాసిస్టు పార్టీగా, దీనిని అవినీతిమయమైన కుటుంబపార్టీగా నిర్వచించారు. ద్రవిడ పదాన్ని అడ్డంపెట్టుకొని, ఈ కుటుంబపార్టీ రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీపడుతూ, కొందరితో లాలూచీకి వచ్చి రాజ్యాన్ని ఏలుకుంటోందని విజయ్ విమర్శలు చేశారు. కామరాజ్, అంబేడ్కర్, వేలు నాచ్చియార్ సహా తనకు ఎందరో ఆదర్శమని, సామాజికన్యాయం, మహిళా సాధికారత ఇత్యాది లక్ష్యాలకు కట్టుబడివున్నామని, దేవుడు లేడన్న వాదన మినహా పెరియార్‌ను మిగతా అన్ని విషయాల్లో అనుసరిస్తామని విజయ్ చెప్పుకొచ్చారు. ఆ సందర్భంగా ఆయన ప్రకటించిన పార్టీ విధానాలమీద తమిళనాడును దశాబ్దాలుగా ఏలుతున్న అన్నాడీఎంకె, డిఎంకె వంటి పార్టీలనుంచి విమర్శలు రావడం సహజం.
కొత్తసీసాలో పాతసారా, కలగూరగంప, కాపీ పేస్ట్ ఎజెండా, కాక్‌టెయిల్ వంటి విమర్శలు ఈ కొత్తపార్టీ ఎదుర్కోంటోంది. రాజకీయాల్లోకి కొత్తయినా ఏ దశలోనూ తాను వెనక్కుతగ్గేది లేదని విజయ్ కాస్తంత గట్టిగా చెబుతున్నారు. ఆరంభం బాగుంది అంటూ రజనీకాంత్ అందించిన శుభాకాంక్షల సందేశంలో కొనసాగింపే కష్టమన్న ధ్వని చాలామందికి తోచింది. రాజకీయరంగ ప్రవేశానికి సర్వమూ సిద్ధం చేసుకున్న తరువాత, దశాబ్దాలుగా సినీరంగంనుంచి పోగేసుకున్న ఆస్తులు, అభిమానాలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ, వయసు, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని రజనీ ఆఖరునిముషంలో వెనకడుగువేసిన విషయం తెలిసిందే. కమలహాసన్ సైతం సొంతంగా పార్టీ ఆరంభించి బొక్కబోర్లాపడ్డారు. గత తమిళ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఆర్నెల్లముందు పార్టీని ప్రకటించి, సిద్ధాంతాలు ఆదర్శాలు అంటూ ఏవో కొన్ని ప్రజలముందు ఉంచిన రజనీకాంత్, నిర్భయంగా రాజకీయ రంగప్రవేశం చేసివుంటే డీఎంకె ఇంత సులభంగా అధికారంలోకి రాగలిగివుండేదా అన్నది కొందరి అనుమానం. ఇప్పుడు, విజయ్ కొత్తపార్టీ ఎవరికి మేలుచేస్తుందన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. ద్రవిడ మున్నేట్ర కళగంను దెబ్బతీయడానికే ఈ తమిళగ వెట్రి కళగం పుట్టుకొచ్చిందని స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు.
కుమారరత్నం ఉదయనిధిని సీఎం కుర్చీలో కూచోబెట్టాలని ఆయన ఆశపడుతున్న తరుణంలో దాదాపు అంతే వయసున్న విజయ్ రాజకీయాల్లోకి రావడం విశేషమైన పరిణామం. అయితే, తమిళరాజకీయాల్లో విజయ్ ప్రవేశం డీఎంకెను కాక అంతకంటే అధికంగా దానికి బలమైన ప్రత్యర్థిగా ఉన్న అన్నాడీఎంకెను దెబ్బతీస్తుందని ఒక విశ్లేషణ. తమిళ ఓటర్లు ప్రధానంగా ఈ రెండుపార్టీల మధ్యా చీలిపోయివున్న నేపథ్యంలో, కరుణానిధి పార్టీ వ్యతిరేకులైన జయలలిత పార్టీ అభిమానులను విజయ్ పెద్ద ఎత్తున తనవైపు తిప్పుకోవచ్చును. జయలలిత మరణానంతరం ముక్కలై, ఆధిపత్యపోరుతో క్రమంగా బలహీనపడుతున్న జయలలితపార్టీనుంచి ఓటర్లు విజయ్‌వైపు మళ్ళిపోవడం అనూహ్యమేమీ కాదు. ఎంతో ఘనంగా తన రాజకీయప్రస్థానాన్ని ఆరంభించిన విజయ్ తమిళరాజకీయాల్లో ఎటువంటి ప్రభావం చూపగలరో 2026లో తేలుతుంది.
ఇవి కూడా చదవండి..
విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..
For more Sports News and Telugu News