Share News

మహిళా రిజర్వేషన్‌ చట్టం హుళక్కేనా?

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:16 AM

‘డీ లిమిటేషన్‌ చట్టం -2002’ ప్రకారం 2026లో డీలిమిటేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టాలంటే జనగణన చేయాలి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2024–-2025 బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,309.46 కోట్ల పద్దులను చూస్తే మోదీ ప్రభుత్వానికి ఈ సంవత్సరం కూడా జనాభా గణన

మహిళా రిజర్వేషన్‌ చట్టం హుళక్కేనా?

‘డీ లిమిటేషన్‌ చట్టం -2002’ ప్రకారం 2026లో డీలిమిటేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టాలంటే జనగణన చేయాలి. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2024–-2025 బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,309.46 కోట్ల పద్దులను చూస్తే మోదీ ప్రభుత్వానికి ఈ సంవత్సరం కూడా జనాభా గణన పక్రియను పూర్తిచేయాలనే ఉద్దేశం ఏ కోశానా లేదనే విషయం ప్రస్ఫుటంగా అర్థమవుతున్నది. దేశంలో జనాభా గణన చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయి. కానీ కేంద్ర బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించకపోవడమే అందుకు ఉదాహరణ. జనాభా గణన ప్రక్రియ పూర్తి కాకుండా డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియ జరగటమనేది అసాధ్యం. అయితే డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్న మరో చట్టం మహిళా రిజర్వేషన్లు. ఈ బిల్లు ఆమోదం సులభమైనా దాని అమలు డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్నది.

డీలిమిటేషన్‌ అనేది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం దీన్ని చేపడతారు. ప్రతి పదేళ్ళకోసారి జరిగే జనగణన ప్రక్రియ తర్వాత డీలిమిటేషన్‌ జరగాలి. డీలిమిటేషన్‌ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది తాత్కాలిక కమిషన్‌ కాబట్టి ఇందులో శాశ్వత ఉద్యోగులంటూ ఎవరూ ఉండరు. అందుకే పదవీ విరమణ పొందిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి దీనంతటికి సారథ్యం వహిస్తారు. దేశంలోని అన్ని గ్రామాలు, జిల్లాల వారీగా ఆయా రాష్ర్టాల జనాభా గణాంకాలను సేకరించి, అధ్యయనం చేసి ఈ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి తన ప్రాథమిక నివేదికను సమర్పిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్ళ సమయం పడుతుందని గత అనుభవాలు చెప్తున్నాయి. అయితే పెరిగిన సాంకేతికత వల్ల ఇప్పుడు అంత సమయం పట్టకపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నప్పటికీ అది కొంచెం అనుమానాస్పదమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందంటే దాన్ని పార్లమెంటు కూడా మార్చలేదు. దానిని తప్పుబడుతూ ఎవరైనా కోర్టుకు వెళ్లినా చెల్లదు. డీ లిమిటేషన్‌ కమిషన్‌ ఏది చెప్తే అదే చట్టం, అదే శాసనం.

స్వాతంత్య్రానంతరం దేశంలో ఇప్పటివరకు నాలుగుసార్లు (1952, 1963, 1973, 2002) మాత్రమే డీలిమిటేషన్‌ జరిగింది. 2002లో తెచ్చిన రాజ్యాంగ సవరణ ప్రకారం– నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ 2026లో చేపట్టాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం జనగణన ప్రక్రియ మొదలుపెడితే కులగణన ప్రక్రియను కూడా చేపట్టాలనే డిమాండ్‌ రాష్ర్టాల నుంచి వ్యక్తమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. అందుకే జనగణన ఆలస్యమవుతున్నది. దానితో ముడిపడి ఉన్న డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. అది పూర్తయితేనే మహిళలకు రిజర్వేషన్ల చట్టం అమలు నోచుకుంటుంది. లేకుంటే ఆ చట్టం మహిళలకు అందని ద్రాక్షే అవుతుంది.


ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 26(1) ప్రకారం తెలంగాణలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 50 అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెరగాలి. రాష్ట్ర విభజన అయిననాటి నుంచి అసెంబ్లీ సీట్ల పెంపునకు కేంద్రం సుముఖంగా ఉందంటూనే కాలయాపన చేస్తున్నది. డీలిమిటేషన్‌ కారణంగా అటు మహిళా రిజర్వేషన్ల చట్టం, ఇటు అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియలు పెండింగ్‌లో ఉండటం కేంద్ర ప్రభుత్వ ఉదాసీనతను తెలియజేస్తున్నది. ఈ విషయమై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో నేను పలుసార్లు ప్రధాని మోదీని కలవడం కూడా జరిగింది.

కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌ వల్ల పారదర్శకత పెరిగి పార్లమెంటు సీట్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా మహిళా చట్టసభ్యుల సంఖ్య ఇటు పార్లమెంట్‌లో, అటు అసెంబ్లీలో గణనీయంగా పెరుగుతుందని చెప్తున్నది. కానీ, వెంటనే మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తేనే ఆ ఫలాలను మహిళలకు త్వరగా అందించవచ్చు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే అది ఇప్పట్లో జరిగే అవకాశమైతే కనిపించట్లేదు. గతంలో ప్రవేశపెట్టిన డ్రాఫ్ట్‌ బిల్లులో ఇలా డీలిమిటేషన్‌తో ముడిపెట్టలేదు. ఇప్పుడే ఎందుకు ఇలా అన్నదాన్నిబట్టి ప్రస్తుత ప్రభుత్వ చిత్తశుద్ధిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో రిజర్వేషన్‌ చట్టం అమలు చేస్తామనటం పోస్ట్‌డేటెడ్‌ చెక్కువంటిదని చెప్పక తప్పదు. ఇక చట్టంలో ఓబీసీ రిజర్వేషన్లకు అవకాశం లేకపోవటం మరో వివాదానికి తెర లేపటమే. ఈ చట్టం వల్ల బీసీ వర్గాలకు నష్టం జరుగుతుందని కొందరు విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ చట్టం, ఇరు రాష్ర్టాల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయంలో తమ చిత్తశుద్ధిని చాటుకోవాలంటే వెంటనే జనగణన ప్రారంభించాలి.

బోయినపల్లి వినోద్‌కుమార్‌

న్యాయవాది, పార్లమెంటు మాజీ సభ్యులు

Updated Date - Aug 17 , 2024 | 05:16 AM