Share News

మాటలు–మర్మాలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:23 AM

భారతదేశానికి చైనా ఎంతో ముఖ్యమైనదని, ఉభయదేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని, ఆ శాంతి ఈ రెండింటికే కాక, యావత్‌ ప్రపంచానికి కీలకమైనదని ప్రధాని నరేంద్రమోదీ...

మాటలు–మర్మాలు

భారతదేశానికి చైనా ఎంతో ముఖ్యమైనదని, ఉభయదేశాల మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు నెలకొనాలని, ఆ శాంతి ఈ రెండింటికే కాక, యావత్‌ ప్రపంచానికి కీలకమైనదని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతోంది. రెండుదేశాలు ద్వైపాక్షిక చర్చలద్వారా, పరస్పర సహకారంతో సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని అమెరికాకు చెందిన న్యూస్‌వీక్‌ మేగజైజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యానించారు. రెండుదేశాల మధ్య దౌత్య, సైనికస్థాయి చర్చలు జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తంచేయడంతో ఆగకుండా, మేము సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరించి, కొనసాగించగలం అంటూ హామీ ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. దాదాపు నాలుగేళ్ళుగా వాస్తవాధీనరేఖ రగులుతున్నా, చొరబాట్లు, కుమ్ములాటలు సాగుతున్నా వాటిని గుర్తించేందుకు, అంగీకరించేందుకు, వ్యాఖ్యానించేందుకు సిద్ధపడని ప్రధాని ఇప్పుడు ఉభయదేశాల మధ్య సుదీర్ఘకాలంగా రాజుకుంటున్న వేడి వెంటనే చల్లారాలని, శాంతినెలకొనాలని చెప్పడం విశేషమైన పరిణామమే.

ప్రధాని వ్యాఖ్యలు పేలవంగా, బలహీనంగా ఉన్నాయని కాంగ్రెస్‌ అంటోంది. ఈ మాటలతో మన చేయి కిందపడేట్టు చేశారని, దురాక్రమించుకున్న భూభాగాల విషయంలో గట్టిగా వాదించడానికి, పట్టుసాధించడానికి చైనాకు మోదీ వ్యాఖ్యలు ఉపకరిస్తాయని కాంగ్రెస్‌ వాదన. చొరబడిన దేశాన్ని తీవ్రంగా హెచ్చరించడానికి బదులు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేపేరిట దానితో చర్చలకు సిద్ధపడటం పిరికితనంగా కనిపిస్తుందన్నది కాంగ్రెస్‌ ఉద్దేశం కావచ్చు. మోదీ వ్యాఖ్యలమీద చైనా సానుకూలంగా, ఆచితూచి స్పందించింది. విభేదాల పరిష్కారం విషయంలో భారత్‌ మాతో కలిసివస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఉభయదేశాల దౌత్య సంబంధాలంటే సరిహద్దులు ఒక్కటే కాదని చైనా అంత ప్రత్యేకంగా ఎందుకు అన్నదో తెలియదుకానీ, ఈ ఇంటర్వ్యూ ద్వారా మోదీ చైనాకు ఒక సానుకూల సందేశాన్నయితే ఇవ్వదల్చుకున్నట్టు ఉంది. తాను మళ్ళీ అధికారంలోకి వస్తే చైనాతో చక్కగా వ్యవహరిస్తానని, ఉద్రిక్తతలు తగ్గిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. అమెరికాతో చర్చలు పునరుద్ధరించుకొని, యూరప్‌, రష్యాలతోనూ సన్నిహితంగా ఉంటున్న చైనాతో భారతదేశం కూడా ఇకపై చక్కగా వ్యవహరిస్తుందేమో! 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నప్పటినుంచి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మోదీ చైనా ఊసెత్తలేదు. ఆయన మంత్రులు మాత్రం అతిజాగ్రత్తగా, చిన్నచిన్న విమర్శలు చేస్తుంటారు. ఎల్‌ఏసీ దగ్గర సైన్యాన్ని పెద్ద ఎత్తున మోహరించి ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తున్నదని ఇటీవల విదేశాంగమంత్రి ఓ మాటన్నారు. గత ఏడేళ్ళలో నాలుగోసారి అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తన పేర్లుపెట్టిన తరువాత మన రక్షణమంత్రి ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ మేమూ ఇలాగే చేస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. మోదీ అధికారంలో ఉన్నంత కాలం భారతభూభాగాన్ని చైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోలేదని అమిత్‌ షా పాతపాటే పాడారు. భారతభూభాగాల్లోకి చైనా చొరబడిందని, అయా ప్రాంతాల్లో తన సైనికులను మోహరించి, స్థావరాలు కడుతున్నదని స్థానికులు, సైనికులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దానిని కొట్టిపారేస్తున్నది. కేవలం గాల్వాన్‌ ఘటనలోనే దాదాపు వెయ్యి చ.కి. భూభాగాన్ని భారత్‌ కోల్పోయిందన్న వాదనలున్నాయి. గతంలో మన గస్తీలో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు దాని వశమైనాయన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 21 రౌండ్ల కమాండర్‌ చర్చలు చైనాను వెనక్కునెట్టిందేమీ లేదు. అమెరికా–చైనా మధ్య ఈ నెల ఆరంభం నుంచి ఎడతెగకుండా చర్చలు సాగుతున్న నేపథ్యంలో, చైనాతో భారత్‌ సత్సంబంధాల గురించి ప్రధాని మోదీ మాట్లాడి ఉండవచ్చు. అమెరికా, చైనా అధ్యక్షుల టెలిఫోన్‌ చర్చల తరువాత, అమెరికా మంత్రులు వరుసపెట్టి చైనా పర్యటనలు చేస్తున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం, ఆర్థిక ఆంక్షలు రష్యాను ఏ మాత్రం బలహీనపరచకపోగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్‌ తదితర దేశాల సాయంతో అది మరింత ఎక్కువగా రెచ్చిపోతున్నది. మరోపక్క గాజాయుద్ధం ఎడతెగకుండా సాగుతూ, చాలా దేశాలను చుట్టబెడుతూ బైడెన్‌కు ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనాతో సానుకూలంగా వ్యవహరించడం అమెరికాకు అవసరం, దానిని అనుసరించడం మనకు క్షేమమని పాలకులు భావిస్తున్నట్టుంది.

Updated Date - Apr 12 , 2024 | 04:23 AM