AP Elections 2024: ఏపీలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు
ABN , Publish Date - May 16 , 2024 | 09:03 PM
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అనంతరం చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులైన అధికారులపై సంచలన చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది. సదరు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసింది.
వీరితో పాటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ 12 మంది అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. హింసాత్మక ఘటనలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఎఫ్ఐఆర్ అప్‌డేట్ చేయాలని స్పష్టం చేసింది.
ఇక పల్నాడు జిల్లా కలెక్టర్‌పై కూడా బదిలీ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. పల్నాడు కలెక్టర్‌పై శాఖాపరమైన విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు నేడే రేపో సీఎస్‌పై వేటుపడే అవకాశం కనిపిస్తోంది. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కౌంటింగ్ ముగిసిన 15 రోజుల దాకా 25 సీఆర్‌పీఎఫ్ బలగాల్ని ఏపీ పంపించాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి హింస చోటుచేసుకోకుండా ఈ బలగాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.