Rishi Sunak-Monk Diet: ప్రతి వారం మొదట్లో 36 గంటల ఉపవాసం..రిషి సునాక్ ఆరోగ్య సూత్రం..దీన్ని ఫాలో అయితే..
ABN , Publish Date - Feb 03 , 2024 | 03:03 PM
నెట్టింట వైరల్‌గా మారిన బ్రిటన్ ప్రధాని డైట్ ప్లాన్. ప్రతి వారం 36 గంటల ఉపవాసం. దీంతో మేలే కాదు కీడు కూడా ఉందంటున్న వైద్యులు
ఇంటర్నెట్ డెస్క్: ఉపవాసం వల్ల కలిగే ఉపయోగాలు అందరికీ తెలిసిందే. అయితే, భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ఫాలో అవుతున్న ఆరోగ్య సూత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. స్లిమ్‌గా యాక్టివ్‌గా కనిపించే ప్రధానిని చూసి ఇప్పుడు జనాలూ ఇదే సూత్రం ఫాలో అవుతున్నారు. ప్రతి వారం బ్రిటన్ ప్రధాని 36 గంటల పాటు ఉపవాసం (36-hour fasting) ఉంటారు. ఆదివారం సాయంత్రం ఐదు నుంచి మంగళవారం ఉదయం 5 వరకూ ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో సాధారణ ఆహారం తీసుకోరు. కేవలం టీ, మంచినీళ్లు, కెలొరీలు తక్కువగా ఉన్న పానీయాలు మాత్రమే తీసుకుంటారు. మరి ఇలా అందరూ చేయొచ్చా? అనే ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాదానం ఇస్తున్నారు.
ఏమిటీ ఉపవాసం?
వైద్యులు దీన్ని మాంక్ ఫాస్ట్‌గా (Monk fast) పిలుస్తున్నారు. అంటే, సన్యాసుల ఉపవాసం అన్నమాట. ఈ తరహా ఉపవాసంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయట.
వరుసగా 36 గంటలు ఏమీ తినకుండా ఉంటే శరీరంలో కండరాల దృఢత్వం కొనసాగిస్తూనే కొవ్వు కరిగించుకోవచ్చు.
ఈ సుదీర్ఘ ఉపవాసంతో శరీరంలోని మృతకణాలు అన్నీ తొలగిపోతాయి. వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తాయి.
హార్మోన్ల సమతౌల్యం కూడా మెరగవుతుంది
విషయాలను సులువుగా ఆకళింపు చేసుకునే శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. రిషి లాంటి బాధ్యతలున్న వాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం
ఉపవాసాల కారణంగా శరీరం, మనసుమీద అదుపు వచ్చి క్రమశిక్షణ అలవడుతుంది. ఇది వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మీద సానుకూల ప్రభావం చూపుతుంది.
నష్టాలు ఇవీ..
ఇది అందరికీ తగిన ఉపవాసం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఈ ఉపవాసంతో కొందరిలో అలసట, చిరాకు, ఏకాగ్రత లేమి వంటి సమస్యలు రావచ్చు.
తలనొప్పి, కడుపులో తిప్పడం, మలబద్ధకం వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది.
వైద్యుల సూచనలు లేకుండా డయాబెటిక్ పేషెంట్లు ఇలాంటి ఉపవాసాలు అస్సలు చేయకూడదు
ఇలా సుదీర్ఘకాలం పాటు ఉపవాసాలు చేసే వారిలో కొన్ని సార్లు కొవ్వు పెరుగుతుంది. ఆహారం అందని విషయాన్ని గుర్తించిన శరీరం కొవ్వులు నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది.