Happy Hormornes: రోజూ ఇలా చేస్తే శరీరంలో సంతోషకర హార్మోన్ల విడుదల! లైఫంతా ఫుల్ ఖుష్!
ABN , Publish Date - Aug 22 , 2024 | 10:02 PM
మెదడు విడుదల చేసే కొన్ని రకాల రసాయనాలు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. మనల్ని సంతోషంగా ఉంచే హ్యాపీ హార్మోన్లు విడుదల కావాలంటే కొన్ని రకాల అలవాట్లు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఆనందమనేది చుట్టూ ఉన్న పరిస్థితులు, బంధాలు, అలవాట్లు, ఆర్థికస్థితిగతులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఆనందం, ప్రశాంతతలు మెదడు (Health) విడుదల చేసే కొన్ని రసాయనాలపై కూడా ఆధారపడి ఉంటాయి. మెదడు విడుదల చేసే సెరెటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ వల్ల మనసులో సంతోషం, దుఃఖం వంటి భావాలు జనిస్తాయి. కాబట్టి, రోజువారి కొన్ని అలవాట్లు చేసుకుంటే మెదడు సంతోషకర హార్మోన్లను(Happy Hormones) విడుదల చేస్తుంది. ఫలితంగా జీవితం ఆనందమయమవుతుంది. మరి ఈ అలవాట్లేంటో ఆ కథనంలో తెలుసుకుందాం.
Electrolyte Imbalance: శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేసే వారిలో ఎండార్ఫిన్స్ అనే సంతోషకర హార్మోన్లు విడుదల అవుతాయి. వీటి వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి ప్రతికూల భావాలు దరిచేరవు.
జీవితంలో మనకున్న వాటితో సంతృప్తి చెందడం, కృతజ్ఞతాభావం కలిగుండటం కూడా మనసులో సానుకూల భావాలను నింపుతుంది. ఫలితంగా సెరటోనిన్ స్థాయిలు పెరిగి జీవితం ఆనందమయంగా కనిపిస్తుంది.
మనిషి సంఘజీవి. కాబట్టి, స్నేహితులు, జీవితభాగస్వామి, బంధువులు మనుషుల జీవితాన్ని ప్రభావితం చేస్తారు. కాబట్టి, మనసుకు దగ్గరైన వారితో సరదాగా గడపడం చేస్తే మెదడు ఆక్సిటోసిన్ విడుదల చేస్తుంది. దీంతో, మూడ్ మెరుగవుతుంది.
మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్ర పోవడం కూడా కీలకమే. నిద్రలేమితో సెరటోనిన్ స్థాయిలు తగ్గి మూడ్ పాడవుతుంది. సెరటోనిన్‌తో పాటు మూడ్‌ను నియంత్రించే ఇతర హార్మోన్లు తగ్గిపోతాయి. కాబట్టి, రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు.
మూడ్ మెరుగుపరచడంలో ఆహారం పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ట్రిఫ్టోఫాన్ అధికంగా ఉండే టర్కీ కోడి, గుడ్లు, బాదంపప్పులు వంటి ఆహారాలతో సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉండే చేపలు కూడా డోపమైన్ స్థాయిలను పెంచి మూడ్‌ను మెరుగుపరుస్తాయి.
మనసుకు నచ్చిన హాబీలతో మానసిక ఉల్లాసం కలుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి, రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా తీరిక చేసుకుని మనసుకు నచ్చిన పనులు చేస్తే మూడ్ మెరుగవుతుంది. జీవితం ఆనందమయం అవుతుంది.
నిత్యం మెడిటేషన్ చేస్తే భావోద్వేగాలపై సులువుగా అదుపు వస్తుంది. సెరటోనిన్, ఎండార్ఫిన్లు విడుదలై మూడ్ బాగుంటుంది. జీవితం మరింత సుసంపన్నం అవుతుంది.