Viral: జబ్బల చుట్టూ ఇలా కొవ్వు పేరుకుంటే.. వెన్నెముక విరిగే ఛాన్స్!
ABN , Publish Date - Aug 02 , 2024 | 08:47 PM
జబ్బల చుట్టూ చర్మం కింద అధికంగా కొవ్వు పేరుకోవడం వెన్నెముక బలహీనతను సూచిస్తుందని వైద్యులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ రెండిటి మధ్య సంబంధం గుర్తించడం ఇదే తొలిసారని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మీ వయసు 50 దాటిందా? జాగ్రత్త.. జబ్బల చుట్టూ పేరుకునే కొవ్వుకు, వెన్నెముక విరిగే ప్రమాదానికి సంబంధం ఉందని తాజా అధ్యయనంలో (Health) తేలింది. జబ్బల చుట్టు కొవ్వు ఎక్కువగా ఉన్న వారికి వెన్నెముక ఫ్రాక్చర్లు అయ్యే ప్రమాదం ఎక్కువని తేలింది. ఈ అధ్యయనాన్ని స్వీడెన్‌లోని యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఎండోక్రైనాలజీ సమావేశంలో ప్రస్తావించారు. ఈ రెండిటికీ మధ్య సంబంధం ఉందని గుర్తించిన తొలి అధ్యయనం ఇదే కావడం గమనార్హం.
వెన్నెముక ఫ్రాక్చర్ల ప్రమాదం అధికంగా ఉన్న వారిని సులభంగా గుర్తించే విధానాన్ని ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చిందని పరిశోధకుల్లో ఒకరైన డా. ఏవా కాసీ పేర్కొన్నారు. జబ్బ చుట్టూ చర్మం కింద పేరుకొనే కొవ్వును సాధారణ స్కిన్ ఫోల్డ్ కాలిపర్ పరీక్షలో బేరీజు వేయొచ్చని, తద్వారా రాబోయే ప్రమాదాన్ని సులువుగా ముందే గుర్తించొచ్చని అన్నారు (Arm fat can lead to spinal fracture says new study).
AC Side Effects: రాత్రంతా ఏసీ గదిలోనే నిద్రిస్తున్నారా? ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి జాగ్రత్త!
బోలు ఎముకల వ్యాధితో (ఆస్టియోపోరోసిస్) బాధపడేవారిలో వెన్నెముక ఫ్రాక్చర్లు ఎక్కువగా సంభవిస్తుంటాయి. కానీ తమకు ఈ వ్యాధి ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే, పొట్టలోపలి అవయవాలు చుట్టూ కొవ్వు, జబ్బ చుట్టూ చర్మం కింద కొవ్వు ఎక్కువగా ఉన్న వారిలో వెన్నెముకలో సాంద్రత తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఇది శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచింది. తాజా అధ్యయనంలో 62 ఏళ్లు పైబడిన 115 మంది స్త్రీపురుషులను ఎంచుకున్నారు. ఆ తరువాత వారి చేతుల చుట్టూ కొవ్వు, ఎముకల గట్టిదనాన్ని అంచనా వేశారు. ఇందుకోసం ఎక్స్ రే అబ్సార్ప్టియోమెట్రీ, ట్రాబిక్యులార్ బోన్ స్కోరు పద్ధతులను వినియోగించారు.
Health: చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అయితే, వయసు పెరుగుతున్నా ఎముకల ద్రుఢంగా ఉండాలంటే క్రమం తప్పకుండా కసరత్తు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. బరువులు ఎత్తడంతో పాటు వాకింగ్, జాగింగ్, మెట్లు ఎక్కడం, డ్యాన్స్ చేయడం, స్కిప్పింగ్ వంటివాటితో ఎముకల్లో కొత్త మూలుగ ఏర్పడి అవి మరింత ద్రుఢంగా మారతాయట. మద్యం, ధూమపానంతో కూడా ఎముకలు రానురాను బోలుగా మారతాయని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు కాల్షియం, విటమిన్ డీ పుష్కలంగా ఉండే సాయ్, ఓట్స్, పాలు, చీజ్, యోగర్ట్ వంటివి తినాలని చెబుతున్నారు. సూర్యరశ్మితో పాటు సప్లిమెంట్ల ద్వారా కూడా విటమిన్ డీ అందుతుందని చెబుతున్నారు.