Cold Showers: ఉదయాన్నే చన్నీటి స్నానంతో లాభమా? నష్టమా?
ABN , Publish Date - Sep 14 , 2024 | 02:52 PM
చన్నీటి స్నానంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు, కొన్ని ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తులు వారి వారి ఆరోగ్య స్థితిగతులను బట్టి చన్నీటితో స్నానం చేయాలో వద్దో తేల్చుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన చన్నీటి స్నానంతో ఉత్సాహం ఇనుమడిస్తుందని పలువురు అనడం వింటూనే ఉంటాం. కానీ ఉత్సాహంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలు (Health) ఉన్నాయని కూడా ఇటీవల కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అయితే, చన్నీటి స్నానం విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. రెండు వైపులా పదునున్న కత్తిలాంటి ఈ అలవాటుతో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు (Benefits and Risks of Cold showers).
Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!
ఉదయాన చన్నీటి స్నానంతో కలిగే ప్రయోజనాలు..
చన్నీటి స్నానంతో తక్షణం రక్తప్రసరణ వేగవంతం అవుతుంది. వైద్యులు చెప్పే దాని ప్రకారం, చల్లటినీరు ఒంటిపై పడగానే రక్తనాళాలు కుంచించుకుపోతాయి. కాసేపటికి మళ్లీ యథాతథస్థితికి చేరుకుంటాయి. దీంతో, రక్తప్రసరణ కాస్త తగ్గి మళ్లీ జోరందుకుంటుంది. ఫలితంగా గుండెతో పాటు ఇతర కీలక అవయవాలకు ఆక్సిజన్ సమృద్ధిగా అంది ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. గుండె జబ్బులు దరిచేరవు. తరచూ చన్నీటి స్నానాలు చేసే కొందరిలో బీపీ నియంత్రణలో ఉన్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది.
చన్నీటి స్నానంతో రోగ నిరోధక శక్తి కూడా మెరుగవుతుందట. వరుసగా 30 రోజుల పాటు చన్నీటిస్నానం చేసిన వారిలో అంటువ్యాధులు వచ్చే అవకాశం మిగతా వారితో పోలిస్తే ఏకంగా 29 శాతం మేర తగ్గినట్టు నెదర్‌లాండ్స్‌లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. చన్నీటి స్నానంతో ఒంట్లో తెల్లరక్త కణాల ఉత్పత్తి పెరిగి ఇన్ఫెక్షన్లు ఎదుర్కొనే శక్తి ఇనుమడిస్తుందట.
ఒక్కసారిగా చల్లటి నీరు ఒంటిమీద పడగానే ఒళ్లు జలదరిస్తుంది. ఫలితంగా మెదడు అలర్ట్ అయిపోతుంది. ఎడ్రనలిన్ అనే హార్మోన్ విడుదలై గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఈ సహజసిద్ధ మార్పులతో మెదడు శరీరం, ఒకేసారి అప్రమత్తమవుతాయి. ఆలోచనల్లో స్పష్టత, ఏకాగ్రత పెరిగి పనులు త్వరగా చేయగల సామర్థ్యం వస్తుంది. చన్నీటి స్నానాలతో మూడు కూడా మారుతుంది. డిప్రెషన్ దూరమవుతుందని అధ్యయనాల్లో తేలింది.
క్రీడాకారులు, అథ్లెట్లకు చన్నీటి స్నానం చాలా మేలు చేస్తుంది. ఆటలతో అలిసిన కండరాలు చన్నీటి స్నానంతో పూర్తిగా కోలుకుంటాయని స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు చెబుతున్నారు. అయితే, పూర్తి ఐస్ బాత్ అంతటి మేలు కలగకపోయినా కొంత వరకూ ఉపయోగకరమే అని అంటున్నారు.
చన్నీటి స్నానం చేసే వారిలో బరువు కూడా నియంత్రణలో ఉంటుందట. చల్లని నీరు శరీరంలో బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తరచూ చన్నీటి స్నానం చేసే వారిలో బ్రౌట్ ఫ్యాట్ క్రియాశీలకంగా మారుతుంది. దీంతో, జీవక్రియలు మెరుగై బరువు తగ్గుతారట.
చన్నీటి స్నానంతో జుట్టు, చర్మానికి కూడా మేలు కలుగుతుందట. చల్లని నీరు కారణంగా చర్మంలోని రంధ్రాలు చిన్నవై పోతాయట. దీంతో, చర్మంలోని సహజసిద్ధమైన నూనెలు నిలిచే ఉండి చర్మకాంతి ఇనుమడిస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.
చన్నీటి స్నానంతో ప్రమాదాలు..
చన్నీటి స్నానాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ గుండె జబ్బులు కలవారికి ఈ అలవాటు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. చన్నీటితో అకస్మాత్తుగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని, ఇది గుండె జబ్బులు ఉన్న వారికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి కూడా చన్నీటి స్నానాలు నిషిద్ధమని చెబుతున్నారు.