Health Tips: ఒంట్లో షుగర్‌ను అమాంతం పెంచేసే పండ్లు ఇవే.. వీటికి దూరంగా ఉండండి
ABN , Publish Date - Nov 12 , 2024 | 03:54 PM
పండ్లు ప్రకృతి ప్రసాదించినవే అయినా.. షుగర్ వ్యాధి ఉన్నవారు వీటి విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం ఉన్న వారు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తినే ప్రతి ఆహర పదార్థంపైనా వీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మనకు సహజసిద్ధంగా ప్రకృతి ప్రసాదించే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, కొన్ని రకాల పండ్లను డయాబెటిక్ పేషంట్లు కచ్చితంగా దూరం పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..
పైనాపిల్ ఎందుకు వద్దంటే..
ఈ పండు ఎక్కువ మోతాదులో చక్కెర స్థాయిలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కరను వేగంగా పెంచుతుంది. అంతే కాదు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్ల లిస్టులోనూ పైనాపిల్ మొదటి వరుసలో ఉంటుంది. దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలను గణనీయంగా పెంచి చక్కర నియంత్రణను కోల్పోయేలా చేస్తుంది. అందుకే ఈ పండు మధుమేహం ఉన్న వారికి తినదగినది కాదంటారు.
ద్రాక్షతో జాగ్రత్త..
ద్రాక్ష పండ్లలోనూ అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ నిల్వలుంటాయి. ఇది డయాబెటిక్ రోగుల రక్తంలో చక్కర స్థాయిని అమాంతం పెంచగలదు. దీనిని తినడం డయాబెటిక్ రోగులకు అంత మంచిది కాదని వైద్యనిపుణుల అంటున్నారు. అయితే, ఏదైనా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్తున్నారు.
మామిడి పండు మేలేనా?
ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరేమో. పండ్లలో రారాజుగా పిలిచే మామిడిలో చెక్కరతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది. ఇది డయాబెటిక్ రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించవచ్చు.
అరటిపండు తినొచ్చా?
ఇందులో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే డయాబెటిస్ కన్ఫర్మ్ అయినవారు ఈ పండును తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
మరేం తినాలంటారు..
మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్ల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అధిక చక్కెర ఉండే వాటికి బదులు వేరే పండ్లను ఎంచుకోవాలి. యాపిల్, బెర్రీలు, బొప్పాయి వంటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. ఆహార నియమాలు పాటించేముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN బాధ్యత వహించదు.)