Health: అకస్మాత్తుగా తలతిరుగుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..
ABN , Publish Date - Nov 20 , 2024 | 05:56 PM
కొందరు చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఉన్నట్టుండి కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే..
కొంతమందిలో ఉన్నట్టుండి తలతిరగడం జరుగుతుంది. ముఖ్యంగా లేచి నిలబడిన వెంటనే లేదా కూర్చున్నప్పుడు సడన్ గా కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. సాధారణంగా మహిళల్లో అయితే ఇది ఐరన్ లోపించడానికి గల కారణంగా చెప్తారు. రక్తహీనత లేదా రక్త స్రావం కారణంగా ఇలా జరుగుతుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు కూడా తలతిరిగే లక్షణం ఉంటుందంటున్నారు అవేంటో చూద్దాం..
బెడ్ రెస్ట్ ఎక్కువైతే..
నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోయినప్పుడు ఇలా జరుగుతుంటుంది. గుండెకు రక్తాన్ని పంపు చేసే సామర్థ్యం తగ్గి.. హార్మోన్ ప్రతిస్పందనలు సరిగా ఉండవు. దాని వల్లే ఇలా జరగొచ్చు. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా సుదీర్ఘంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా శరీరానికి రక్తం సప్లై సరిగా ఉండదు. అందువల్ల లేచి నిలబడిన వెంటనే శరీరం తూలినట్టుగా అనిపిస్తుంటుంది.
హెచ్ బీ కౌంట్ తగ్గినప్పుడు..
65 సంవత్సరాల వయసు పైబడినవారిలో ఈ సమస్య సాధారణంగానే కనిపిస్తుంది. ఒకవేళ ముందు నుంచే మద్యం తాగే అలవాటు ఉంటే అది ఈ వయసులో రక్తనాళాలను బలహీనపరిచి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్(హెచ్బీ) లెవెల్స్ తక్కువగా ఉన్న తల తిరుగుతుంది. యుక్త వయసులో ఉన్న యువతీ యువకుల్లో ఈ సమస్య అధికంగా కనపడుతోంది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ ను అందించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మందులు వాడే వారిలో..
వివిధ రకాల మందుల వాడకం, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా తరచూ కళ్లు తిరుగుతున్నట్టు అనిపించవచ్చు. అడ్రినల్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది.