Share News

Blood Pressure: హైబీపీతో బాధపడుతున్నారా.. అయితే ఆ ముప్పు ఉన్నట్లే

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:30 PM

ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మధ్యకాలంలో ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీతో మనిషి ఆరోగ్యం పెను ప్రమాదంలో పడింది. చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్న కేసులో ఎన్నో బయటపడుతున్నాయి.

Blood Pressure: హైబీపీతో బాధపడుతున్నారా.. అయితే ఆ ముప్పు ఉన్నట్లే

ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మధ్యకాలంలో ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీతో మనిషి ఆరోగ్యం పెను ప్రమాదంలో పడింది. చిన్న వయసులోనే మధుమేహం, బీపీ, గుండె జబ్బులు తదితర వ్యాధులతో బాధపడుతున్న కేసులో ఎన్నో బయటపడుతున్నాయి. మధుమేహంతోపాటు బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరుగుతోంది. బీపీ ఎక్కువైనా సమస్యే, తక్కువైనా సమస్యే. తరచూ హైబీపీకి గురవుతున్నవారికి ఓ ముప్పు పొంచి ఉందని తాజాగా మిచిగాన్ మెడిసిన్ అధ్యయనం వెల్లడించింది. గుండెపోటు సమస్య లేని 18 ఆపై వయసున్న 40 వేల మందిని నిపుణులు పరిశీలించారు. తరచూ ఎలివేటెడ్ సిస్టోలిక్ బీపీ వస్తుంటే అది రెండు రకాల హార్ట్ స్ట్రోక్‌ల ప్రమాదాన్ని పెంచుతుందట.


అధ్యయనం సారాంశం ఇదే..

ఈ అధ్యయనంలో పరిశోధకులు మూడు రకాల స్ట్రోక్‌లను అధ్యయనం చేశారు. మొదటిది ఇస్కీమిక్ స్ట్రోక్. ఇది మెదడుకు వెళ్లే రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. గుండెపోటు కేసుల్లో 85 శాతం ఇవే ఉంటాయి. ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్, సబ్‌అరాక్నోయిడ్ స్ట్రోక్‌లతో మెదడులోనే తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఇది మెదడు చుట్టు కణజాలాలను దెబ్బతీస్తుంది. సగటు సిస్టోలిక్ రక్తపోటు సాధారణం కంటే 10 mm Hg ఎక్కువగా ఉండటం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం, ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదం 31 శాతం పెరుగుతుందని పరిశోధకుల అంచనా. ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం నల్లజాతి రోగులకు శ్వేతజాతీయుల కంటే 20 శాతం ఎక్కువగా ఉంది.


నల్లజాతీయులు ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ ప్రమాదాన్ని 67 శాతం ఎక్కువగా ఎదుర్కొంటారు. స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి సిస్టోలిక్ రక్తపోటును నియంత్రించాలని వైద్యులు చెబుతున్నారు. 2020లో వచ్చిన ఒక జాతీయ అధ్యయనం.. అమెరికాలో 2013 నుంచి 2018 వరకు రక్తపోటు నియంత్రణ క్షీణించిందని వెల్లడించింది. బీపీలో ఎలాంటి తేడాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధి తీవ్రతనుబట్టి మందులు వాడాల్సి ఉంటుంది. ఇంట్లోనే బీపీ చెక్ చేసుకునే పరికరాలను ఉంచుకుని.. తరచూ బీపీని తనిఖీ చేయాలి.

హైబీపీకి చెక్ పెట్టండిలా..

అధిక రక్తపోటు బారిన పడకుండా ఉండాలన్నా, హై బీపీ రోగులు మందులు లేకుండా దాన్ని తగ్గించుకోవాలన్నా జీవనశైలి మార్చుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా వంటలో వాడే ఉప్పును తగ్గించాలి.


ఉప్పు అధికంగా తినడం అనేది హైబీపీని పెంచుతుంది. దీంతో మనం ముందుగా చెప్పుకున్నట్లు రకరకాల సమస్య బారిన పడతాం. హై బీపీ నివారించేందుకు పొటాషియం అధికంగా ఉండే పండ్లు తీసుకోవడం చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. అలాగే కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు దినుసులు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి..

హైబీపీ నియంత్రణలో ఉండాలంటే ఒత్తిడిని నివారించుకోవాలి. ఈరోజుల్లో పని ఒత్తిడి, ఆందోళనలు తీవ్రంగా ఉంటున్నాయి. దానికి కారణం పోటీ ప్రపంచం, మన జీవనశైలి. ఒత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి అనేది అధిక రక్తపోటును పెంచుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచే పనులు చేయాలి. ధ్యానం, యోగాపై దృష్టి పెట్టాలి. అలాగే మంచి నిద్ర కూడా హై బీపీని అదుపులో ఉంచుతుంది. సిగరెట్ తాగకూడదు. సిగరెట్‌లో ఉండే నికోటిన్ అనేది హై బీపీని పెంచుతుంది. కాబట్టి ఈ అలవాటును దరిచేరనీయకపోవడం చాలా మంచిది.


ధూమపానం వల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉన్నందున్న దీని జోలికి వెళ్లకపోవడం మంచిది.అలాగే శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువు అనేది హై బీపీని పెంచుతుంది. కాబట్టి ఎప్పుకప్పుడు వ్యాయామం చేస్తుండాలి. దానికి వాకింగ్ లేదా జిమ్‌కు వెళ్లడం మంచిది. ఇలా హైబీపీని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

For Latest News and National News click here

Updated Date - Jul 31 , 2024 | 04:30 PM