Share News

చలికాలంలో చర్మ సంరక్షణ ఎలా?

ABN , Publish Date - Nov 24 , 2024 | 10:08 AM

చలికాలంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ. దీనిని ఎదుర్కొనడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, పిస్తా, ఆక్రోట్‌, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు వంటి వాటిని ప్రతిరోజూ తీసుకోవాలి.

చలికాలంలో చర్మ సంరక్షణ ఎలా?

చలికాలంలో చర్మసంరక్షణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

- కావేరి, విజయవాడ

చలికాలంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ. దీనిని ఎదుర్కొనడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, పిస్తా, ఆక్రోట్‌, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు వంటి వాటిని ప్రతిరోజూ తీసుకోవాలి. విటమిన్‌ సి కూడా చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తికి అవసరం. నిమ్మ, కమలా, నారింజ, ఆపిల్‌, జామ, దానిమ్మ మొదలైన తాజా పండ్లన్నీ విటమిన్‌ ‘సి’ అందిస్తాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌, ఆలివ్‌నూనె, కొబ్బరినూనె వంటివి వాడడం వలన కూడా చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది. పెదవులు పగలకుండా ఉండేందుకు తగినన్ని నీరు తీసుకోవడం, వాసిలిన్‌ లేదా నెయ్యి రాసుకోవడం కూడా మంచిదే. శీతాకాలంలో ఆహారాన్ని వేడిగా తీసుకోవడమే మేలు. ఎక్కువగా సూప్స్‌ తీసుకుంటే శరీరానికి కావలసిన నీరు అందుతుంది. అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, లవంగాలు వంటి మసాలా దినుసులు వాడడం వల్ల కూడా శీతాకాలం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎండ తగిలే అవకాశం తక్కువ కాబట్టి వీలుచేసుకొని రోజుకు కనీసం అరగంటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.


మా నాన్నగారికి 80 ఏళ్ళు. రక్తంలో సోడియం తక్కువగా ఉంటోంది. మజ్జిగలో ఉప్పు వేసి ఇవ్వడం వలన ఈ సమస్య పరిష్కారమవుతుందా?

- నరసింహమూర్తి, తొర్రూర్‌

sun7.2.jpg

వయోవృద్ధుల రక్తంలో సోడియం తక్కువ ఉండడానికి వారు వాడే మందులు, గుండె, కాలేయం, మూత్రపిండాల పనితీరులో మార్పులు వంటి వివిధ కారణాలుండవచ్చు. ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారమవదు. ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించిన ఇబ్బంది వలన సోడియం తగ్గుతున్నట్టయితే, అధిక సోడియం తీసు కొంటే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఇటువంటి సందర్భాల్లో సోడియం ఉండడానికి కారణాన్ని వైద్యుల సహాయంతో గుర్తించి దానికి తగిన వైద్యం పొందాలి. రోజులో తీసుకొనే నీళ్ల పరిమాణం నియంత్రిస్తే కొంతవరకు ఉపయోగముంటుంది. రోజుకు 500-750 మిల్లీ లీటర్లకు మించకుండా మాత్రమే నీళ్లు తీసుకోవాలి. మరొక అరలీటరు మంచి నీళ్ల రూపంలో కాకుండా మజ్జిగ, వెజిటబుల్‌ సూప్‌, నీరు పోసి వండిన కూరలు, వెజిటబుల్‌ జ్యూస్‌, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాల ద్వారా తీసుకోవాలి. త్వరగా వైద్యులను సంప్రదించి తగిన సూచనలు పొందితే... ఒకవేళ ఏవైనా మందుల్లో మార్పులు చేయాల్సి వస్తే చేస్తారు.


మనం తీసుకొనే ఆహారంలో తగినన్ని విటమిన్లు, ఖనిజాలు లభించనప్పుడు ఏమిచేయాలి?

- శివానందరావు, కర్నూలు

ఆహారంలో ఉండే పోషకాల్లో అధికభాగం శాకాహారమైతే ఆ మొక్కలు పెరిగిన మట్టి నాణ్యతను బట్టి, మాంసాహారమైతే ఆయా జంతువుల ఆహార నాణ్యతను బట్టి ఉంటాయి. అలాగే ఆహారం నిల్వ పద్ధతులు, తయారీ లేదా వండే విధానాల వల్ల కూడా ఈ పోషకాల పరిమాణంలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా తీసుకున్న ఆహారంలోని పోషకాలను సంగ్రహించే శక్తి కూడా మనిషికీ మనిషికీ తేడా ఉంటుంది. అందుకే ఒకేరకమైన ఆహారం తీసుకొంటున్నప్పటికీ కూడా కొంతమందిలో పోషకలోపాలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యంలో మార్పులు, కొన్ని రకాల లక్షణాలను బట్టి ఏవైనా పోషకాలు సరిగా అందడం లేదు లేదా పోషకలేమి ఉందని... ఏవైనా పరీక్షల ద్వారా నిర్ధారించబడినట్టయితే వైద్యులు, పోషక నిపుణుల సలహా మేరకు తగిన మోతాదులో సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా తక్కువ మోతాదులో తీసుకొనే సప్లిమెంట్ల వలన ఎటువంటి ఇబ్బందీ ఉండనప్పటికీ... కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు సప్లిమెంట్ల రూపంలో తీసుకున్నప్పుడు వాటి ప్రభావం వలన వేరే ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సరైన నిపుణుల సూచనలు లేకుండా సప్లిమెంట్లను వాడరాదు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Nov 24 , 2024 | 10:08 AM