సక్రమంగా రావట్లేదు... ఏం చేయాలి?
ABN , Publish Date - Oct 27 , 2024 | 09:32 AM
మా చెల్లికి 27 ఏళ్ళు. బరువు 55 కేజీలు. గత రెండేళ్లుగా పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. ఆహారం ద్వారా ఏదైనా పరిష్కారం తెలపండి.
మా చెల్లికి 27 ఏళ్ళు. బరువు 55 కేజీలు. గత రెండేళ్లుగా పీరియడ్స్
సక్రమంగా రావడం లేదు. ఆహారం ద్వారా ఏదైనా పరిష్కారం తెలపండి.
- హసీనా షేక్, లింగంపల్లి
నెలసరి సక్రమంగా రాకపోవడానికి పలు రకాల కారణాలు ఉంటాయి. బరువు, హార్మోనుల అసమతుల్యత, రక్తహీనత వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సమస్యకు కారణాన్ని తెలుసుకున్న తరువాత మాత్రమే సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. రోజులో కనీసం రెండు లేదా మూడుసార్లు తాజా పళ్ళు, సలాడ్ల రూపంలో టమాటా, కీరా, క్యారెట్ వంటి కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. సోయా గింజలు, వాటి ఉత్పత్తులైన మీల్ మేకర్, సోయా పనీర్ లాంటివి కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
రక్తహీనత సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్ల వాడకం అవసరం పడవచ్చు. ఇనుము కోసం రోజూ కొద్ది మొత్తంలో మాంసం, చికెన్, ఆకుకూరలు, ఉడికించిన గింజలు తీసుకోవచ్చు. నూనెలో వేయించిన కూరలు లేదా చిరుతిళ్ళు, అల్పాహారాలు కూడా తగ్గించాలి. ఫాస్ట్‌ఫుడ్స్, స్వీట్లు, చాక్‌లెట్లు, కేకులు, బిస్కెట్లు లాంటి బేకరీ ఆహారాన్ని పూర్తిగా మానెయ్యాలి. రోజుకు రెండున్నర నుండి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. అరగంట పాటు ఏదో ఓ వ్యాయామం చెయ్యాలి. ఏడెనిమిది గంటల నిద్ర అవసరం.
మా బాబుకి ఎనిమిదేళ్లు. ఏదైనా తొందరగా మరచిపోతాడు. వాడికి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏయే ఆహార పదార్థాలు పెడితే మంచిది?
- వినతి, రామచంద్రపురం
పిల్లల్లో జ్ఞాపకశక్తి సరిగా ఉండాలంటే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. ఇవి అధికంగా లభించే చేపలు, చేప నూనె, గుడ్లు, అవిసె గింజలు, ఆక్రోట్ గింజలు తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుచ్చ, దానిమ్మ, బొప్పాయి, నేరేడు లాంటి పండ్లు, అన్ని ఆకు కూరలు, అన్ని రకాల కూరగాయలు రోజూ కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. పసుపులో క్యార్క్యుమిన్ అనే పదార్థం కూడా మెదడు ఆరోగ్యానికి మంచిదని పరిశోధనలు తెలుపుతున్నాయి.
కూరల్లో వాడడం మాత్రమే కాక పాలలో పసుపు వేసుకొని తాగితే కూడా మంచిదే. జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ లాంటి ఖనిజాలు ఉండే అన్ని రకాల గింజలు జ్ఞాపకశక్తికి ఉపయోగపడతాయి. కోడిగుడ్లలో పుష్కలంగా లభించే కొలిన్ అనే విటమిన్ మెదడు ఆరోగ్యానికి మంచిది. మంచి ఆహారపు అలవాట్లతో పాటు మంచి నిద్ర, శారీరక శ్రమ, ఆందోళన లేని జీవితం మెదడు ఆరోగ్యానికి అత్యవసరం. మెదడుకు పదును పెట్టే పజిల్స్, సంగీతం, చిత్రకళ లాంటి ఏవైనా కొత్త సృజనాత్మక హాబీలు అలవర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలను తరచూ వేరే పిల్లలతో లేదా ఇంట్లో వాళ్ళతో చర్చించడం ద్వారా కూడా జ్ఞాపకశక్తి బాగుంటుంది.
నాకు ఈ మధ్యే బీపీ, షుగర్ వచ్చాయి. నా డైట్‌ను ఎలా మార్చుకోవాలో తెలియజేస్తారా? అలాగే పండ్ల గురించి కూడా.
- సుదర్శన రావు, మేడిపల్లి
బీపీ నియంత్రణలో ఉండాలంటే ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవాలి. తాజా కాయగూరలు, సలాడ్లు, పండ్లు తీసుకొంటే వాటిలోని పొటాషియం కూడా బీపీ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. ప్రతి పూటా ఆహారం తీసుకోవడానికి ముందు ఉడికించిన కూరగాయలు లేదా సలాడ్‌తో మొదలు పెడితే రక్తంలో గ్లూకోజు కూడా చక్కగా కంట్రోల్ చేయవచ్చు. మీ రక్తంలో గ్లూకోజు ఎంత నియంత్రణలో ఉంటోంది అనే దానిని బట్టి పండ్ల మోతాదు నిర్ణయించుకోవచ్చు. రోజుకు వంద నుండి నూటయాభై గ్రాముల లోపు పండ్లు తీసుకుంటే మేలు. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు కానీ రక్తంలో గ్లూకోజును త్వరగా పెంచే అరటి, సపోటా, పైనాపిల్, సీతాఫలం, ద్రాక్ష వంటివి 50 గ్రాములకంటే ఎక్కువ తీసుకోకూడదు.
జామ, ఆపిల్ (పై చెక్కుతో పాటు), నారింజ, పుచ్చ, ఖర్బుజా, బొప్పాయి. ఆల్బక్రా, కివీ మొదలైనవి రోజూ తీసుకోవచ్చు. బాదం, ఆక్రోట్, పుచ్చ గింజలు లాంటివి పరిమిత మోతాదుల్లో రోజుకు అన్నీ కలిపి ఇరవై గ్రాములకు మించకుండా చేర్చుకుంటే బీపీకి మంచిది. వారంలో మూడు నుంచి నాలుగు సార్లు ఆకుకూరలు తీసుకోవాలి. పాలు, పెరుగు వెన్న తీసినవి మాత్రమే తీసుకోవాలి. టీలు, కాఫీలు తాగడం వల్ల బీపీ సమస్య పెరిగి మరింత నీరసం వస్తుంది కాబట్టి అవి తగ్గించడం లేదా మానెయ్యడం మంచిది. ఉదయం అల్పాహారంగా పాలు, గుడ్డు, కొద్దిగా ఉడికించిన లేదా మొలకెత్తిన పెసలు, సెనగలు, కొంచెం పచ్చి కూరగాయలు తీసుకుంటే రోజు ఉత్సాహంగా మొదలవుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్