Jaggery tea vs sugar tea: చక్కెర టీ వర్సెస్ బెల్లం టీ.. ఏది బెటర్? నిపుణులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
ABN , Publish Date - Jul 27 , 2024 | 10:38 PM
చక్కెర టీ వర్సెస్ టీలల్లో ఏదీ బెటరనేదానిపై నిపుణులు పూర్తి స్పష్టత ఇచ్చారు. వారి వివరణ ఏంటో, ఆ రెండింటిలో మంచిది ఏదో తెలుసుకునేందుకు ఈ కథనం చదవండి.
ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే టీ తాగకుండా ఉండలేమని భావించేవారు కోకొల్లలు. అయితే, బెల్లం టీ తాగాలా లేక చక్కెరతో చేసిన టీ తాగాలా అనేది డయాబెటిక్ పేషెంట్లు (Health) ప్రధానంగా ఎదుర్కొనే సందిగ్ధం. దీనిపై నిపుణులు సవివరమైన సమాధానం ఇస్తున్నారు. అదేంటో ఓసారి చూద్దాం (Jaggery tea vs sugar tea ).
బెల్లం, చక్కెర రెండిటినీ చెరకు నుంచి చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, వీటి తయారీ విధానాల్లో కాస్తంత తేడా ఉంటుంది. చెరకు బాగా శుద్ధి చేసి అంటే రిఫైన్ చేసి తయారు చేసేదే చెక్కర. ఇందుకు భిన్నమైన పద్ధతిలో చేసే బెల్లంలో తీపితో పాటు ఐరన్, కాల్షియం, ఇతర మినరల్స్ ఉంటాయి. కాబట్టి, చాలా మంది బెల్లం టీ బెటరని అంటుంటారు.
Health: చక్కెర తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అయితే, శరీరం మినరల్స్, ఇతర పోషకాలను గ్రహించకుండా అడ్డుకునే రసాయనాలు టీలో ఉంటాయట. కాబట్టి టీలో బెల్లం వేసుకున్నా శరీరానికి పెద్దగా ఉపయోగం ఉండదని, అందులోని పోషకాలను శరీరం పూర్తి్స్థాయిలో గ్రహించలేదని చెబుతున్నారు.
ఇక రక్తంలోని గ్లూకోజ్.. సాధారణ చక్కెర లేదా బెల్లం నుంచి అందినా తేడా ఏమీ ఉండదని చెప్పుతున్నారు. రెండిటి వల్లా రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరుగుతాయని చెబుతున్నారు. చక్కెర, బెల్లం లేదా మరే ఇతర పదార్థమైనా సరే టీలోని పోషకాలను పెంచలేవని కూడా చెబుతున్నారు. కాబట్టి, ఈ విషయాలపై అవగాహనతో ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు.
ఇక టీ ఎంత ఆరోగ్యకరమైనా కొన్ని సందర్భాల్లో దీనికి దూరంగా ఉండటమే బెటరని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపు టీ తాగడం, లేదా భోజనం తరువాత తాగడం చేయకూడదని చెబుతున్నారు. ఇక సాయంత్రం 4 తరువాత కెఫీన్ ఉన్న పదార్థాలు తింటే రాత్రి నిద్ర చెడిపోయే ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు.