Share News

లైంగికశక్తిని పెంచే గం‘బీర’

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:38 AM

‘‘నిగమశర్మాభిధానంబు నేతిబీర కాయయునుబోలె’’ దురలవాట్లకు బానిసైన నిగమశర్మని నేతిబీరకాయతో పోల్చాడు తెనాలి రామ కృష్ణుడు....

లైంగికశక్తిని పెంచే గం‘బీర’

‘‘నిగమశర్మాభిధానంబు నేతిబీర కాయయునుబోలె’’ దురలవాట్లకు బానిసైన నిగమశర్మని నేతిబీరకాయతో పోల్చాడు తెనాలి రామ కృష్ణుడు. పేరు దిబ్బగాని ఊరు గొప్పదేనన్నట్టు బీరకాయని పథ్యం కూరగా అంటే జబ్బుపడి లేచిన వాళ్లకు పెట్టదగినదిగాను, నేతి బీర కాయని నిలువెల్లా అబద్ధం నయవంచన లకు ప్రతినిధిగానూ చిత్రిస్తారు గానీ ఈ రెండింటికీ మించిన కాయగూరలు ఏమున్నాయి! అంత మాట పడటానికి దాని పేరులో నెయ్యి ఉండ టమే కారణం. దానికా పేరుపెట్టి అవమానిం చటం అన్యాయమే! మగాళ్లలో నపుంసకత్వాన్ని, ఆడాళ్లలో వంధ్యత్వాన్ని పోగొట్టి సుఖసంసా రాన్నిస్తుంది బీర. లైంగిక తృప్తి పెరగాలంటే, నేతిబీర కబుర్లు మానేసి నేతిబీరకాయని, బీరకాయని వండుకుని రోజూ తినండి!

‘‘ ‘....’ జెయును బీరకాయయు/ ముంజె యుం బాల్యమునఁ జూల మోహము గొలుపున్‌/రంజన చెడి ముదిరిన వెను/కం జూడరు కుందవరపు కవి చౌడప్పా’’ వేశ్యలు, బీరకాయలు, తాటిముంజెలు లేతగా ఉంటేనే మోహాన్ని కలిగిస్తాయి. ముదిరితే రంజనచెడి పట్టించుకోరంటాడు కవి కుందవరపు చౌడప్ప. లేతబీరకాయలే ప్రయోజనకరమైనవన్నమాట! నేతిబీర కూడా బీరలో రకమే! రెండింటి గుణాలు దాదాపు సమానమే! నేతిబీరకు రుచి, ప్రభావాలు కొద్దిగా ఎక్కువ. ఉష్ణ మండలాల్లో ఉండేవాళ్ల కోసం ప్రకృతి అందించే ఆహార ఔషధం బీర. పెద్దబీర, ఏనుగుబీర, నేతిబీర, పొట్టిబీర, నిడువుబీర, గుత్తిబీర, గరుకుబీర, నున్నబీర ఇలా బీరలో చాలా రకాలున్నాయి.

పోషకాల ‘కోశం’ (నిధి) కాబట్టి కోశాతకీ అన్నారు. ప్రాచీన ద్రావిడ రూపం ‘బిర్‌’ లోంచే బిరుసు అనే తెలుగు పదం ఏర్పడింది. దీని తొక్క బిరుసుగా ఉంటుంది కాబట్టి బీర అని పిలిచి ఉండవచ్చు. లోపల గుజ్జుకన్నా బిరుసుగా ఉండే తొక్కలోనే పోషకాలు ఎక్కువ. పాశ్చాత్యులు లూఫ్ఫా అనీ, బలమైన పీచుని బట్టి దీన్ని స్పాంజిగోర్డ్‌ అనీ పిలుస్తారు. దట్టంగా అల్లుకొని ఉంటుందని బీరపీచుతో మానవ సంబంధాల్ని, బంధుత్వాల్ని పోలు స్తారు. లేత బీరలో ఉండే ‘ఆహారపీచు’ (డయ టరీ ఫైబర్‌) పేగుల్ని దృఢతరం చేస్తుంది. దీని లో ఉండే సెల్యులోజ్‌ దీనికి తీపి రుచినిస్తోంది. ఈ సెల్యులోజ్‌‘లో తేడాలవలన కొన్ని బీర కాయలు చేదుగా ఉంటాయి. రుచిచూసి తరగాలి.

లేత బీరకాయల్ని కొద్దిగా చెక్కు తీసిసన్నగా, పొడవుగా ముక్కలు చేసి, పైన ఉప్పు కారం చల్లి, నిమ్మరసం పిండి పచ్చివిగానే సలాడుల్లో కీరదోసలాగా తింటారు. మిక్సీపట్టి రసం తీసి చారు కాచుకోవచ్చు.

బీరకాయపైన కోణాలు తీసేసి, తొక్కుతో సహా మంటమీద కాల్చి, సుగంధ ద్రవ్యాలు చేర్చి మెత్తగా నూరి బజ్జుపచ్చడి చేస్తారు.

బీరకాయ ముక్కల్ని మగ్గనిచ్చి కొత్తిమీర వగైరాలతో అలంకరించి చేసిన ఇగురుకూర బలకరం. బీరకాయకూరని నేతితో వండటం, నెయ్యి వేసుకుని తినటం వలన దోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. సేమ్యానూడుల్సుతో కూడా ఇగురుకూర చేస్తారు. కోడిగుడ్డు సొన పోసి ‘పొరటు’ చేస్తారు. మాంసాన్ని నులికొట్టి ఉడికించి, బీరకాయతో కలిపిన కైమాకూర అమిత బలకరం. దీనితో సూపు కాచుకోవచ్చు. చిన్న బీరకాయల్లో కూరపొడి కూరి గుత్తిబీర కూర చేస్తారు. బీరకాయల్ని చక్రాలుగా తరిగి బజ్జీలు వేస్తారు. కమ్మగా ఉంటాయి.

బీరముక్కల్ని మగ్గించి, మిక్సీపట్టి తాలింపు పెట్టిన రోటిపచ్చడి పచ్చళ్ళలో రారాజు! బీర కాయపైన తొక్కుని విడిగా తీసుకుని సన్నగా తరిగి కొంచెం నూనె వేసిన కడాయిలో మగ్గ బెట్టి, శనగపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ ఎండుమిరపకాయలతో కలిపి వేగించి మిక్సీ పడితే పొట్టుపచ్చడి అంటారు. తొక్కుల్ని ఎండించి కారప్పొడి చేసుకుంటే రోజూ తినదగినిదిగా ఉంటుంది.

బీరముక్కలు, ఉల్లిముక్కలు, పచ్చిమిరప ముక్కలు వేసి మగ్గించి చింతపండు రసం కలిపి, చేసిన పులుసుకూర రుచికరం. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్రకందిపప్పు, శనగపప్పు ఈ ఐదు పప్పుల్ని విడివిడిగా దోరగా వేగించి, సమానంగా తీసుకుని బీరకాయముక్కలు కలిపి ఉడికించిన పప్పు అమిత శక్తిదాయకం. ఉపాయం ఉండాలే గానీ బీరకాయతో రోజుకొకరకం వంట చేసుకుని రోజూ తినదగిన గొప్ప ఔషధాహారం బీర! అమితమైన చలవ నిస్తుంది. విషదోషాల్ని హరిస్తుంది. జీర్ణాశయాన్ని, జననాంగ వ్యవస్థని, గర్భాశయాన్ని బలసంపన్నం చేస్తుంది. లైంగికశక్తిని పెంచే ధీరగంభీర బీర!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Feb 04 , 2024 | 11:38 AM