Monsoon Health Tips: వర్షాకాలంలో వ్యాధులు రావొద్దంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే..!
ABN , Publish Date - Aug 12 , 2024 | 07:32 PM
Monsoon Health Tips: ప్రతి సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కానీ, వర్షాకాలంలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, పారిశుద్ధ్య సమస్యల కారణంగా.. త్వరగా వ్యాధులు ప్రభలుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
Monsoon Health Tips: ప్రతి సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కానీ, వర్షాకాలంలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో దోమల వ్యాప్తి, పారిశుద్ధ్య సమస్యల కారణంగా.. త్వరగా వ్యాధులు ప్రభలుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. తద్వారా రోగనిరోధక శక్తి పెరిగుతుంది. వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా కొన్ని కూరగాయలు, పండ్లు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ సీజన్‌లో ఏం తినాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
కాకరకాయ: వర్షాకాలంలో కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో నిర్విషీకరణ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచే సామర్థ్యం ఉంటుంది. ఇది కాలేయం, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో కాకరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
సొరకాయ/ఆనపకాయ: సొరకాయ తేలికగా జీర్ణమయ్యే కూరగాయ. ఇది జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బీరకాయ: బీరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతోపాటు.. శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పీచు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు.. బీరకాయ తింటే ప్రయోజనం ఉంటుంది. వర్షాకాలంలో బీరకాయ తింటే ఎంతో మేలు జరుగుతుంది.
తోటకూర, బచ్చలికూర: ఈ ఆకు కూరలలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
మెంతికూర: మెంతులు, మెంతికూర శోథ నిరోధక, యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి. మెంతి కూర తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే ఇన్‌ఫెక్షన్ల నుంచి ఇది కాపాడుతుంది.
మునగకాయ: మునగకాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని రోగనిరోధక లక్షణాలు వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
క్యారెట్: క్యారెట్‌లో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దృష్టిని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే, క్యారెట్‌లోని విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చర్మం, దృష్టిని ప్రోత్సహిస్తుంది. వర్షాకాలంలో దినిని తినడం చాలా మంచిది.
బీట్‌రూట్: బీట్‌రూట్‌లో అధిక ఐరన్ కంటెంట్ రక్తహీనతను నివారిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే బీట్‌రూట్‌ను వర్షాకాలంలో తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుమ్మడికాయ: గుమ్మడికాయలో విటమిన్ ఎ, సి, ఇ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలోని విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
బెండకాయ: బెండకాయలో విటమిన్ ఎ, సి, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.