కాలుష్యం... కాటేస్తోంది!
ABN , Publish Date - Nov 24 , 2024 | 07:09 AM
చలికాలం వచ్చిందంటే కాలుష్యం కలవరపెడుతుంది. నగరాలన్నీ పొగమంచుతో నిండిపోతాయి. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ, వాహనాల కాలుష్యం, భవన నిర్మాణ వ్యర్థాలు... ఇవన్నీ కలిసి నగరవాసులకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ నగరంలో ఎక్కువ కాలుష్యం ఉంది? ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఓ లుక్కేయండి...
చలికాలం వచ్చిందంటే కాలుష్యం కలవరపెడుతుంది. నగరాలన్నీ పొగమంచుతో నిండిపోతాయి. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ, వాహనాల కాలుష్యం, భవన నిర్మాణ వ్యర్థాలు... ఇవన్నీ కలిసి నగరవాసులకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ నగరంలో ఎక్కువ కాలుష్యం ఉంది? ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఓ లుక్కేయండి...
ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం పాకిస్థాన్‌లోని లాహోర్. ఇక్కడి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 790గా నమోదయ్యింది. ఆ తర్వాతి టాప్ 5 స్థానాల్లో దిల్లీ (406), ఢాకా (204, బంగ్లాదేశ్), హనోయ్ (182, వియత్నాం), కోల్‌కతా (181) ఉన్నాయి.
సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) లెక్కల ప్రకారం మనదేశంలో దిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా హాజీపూర్, భివానీ, చండీగఢ్, గజియాబాద్, భీవండి, గ్రేటర్ నోయిడా, బద్ది, సోనిపట్, పుర్నియా ఉన్నాయి.
గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళికణాల (పీఎం 2.5) వల్ల ఆస్థమా, క్యాన్సర్, గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే అవకాశాలెక్కువ. పిల్లల బుద్ధి వికాసంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. అప్పటికే ఉన్న కొన్ని వ్యాధుల్ని తీవ్రతరం చేస్తుంది.
మనదేశంలో వాయు కాలుష్యం ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉంది. అత్యధిక కాలుష్య దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
శీతాకాలం ఇంట్లో కూడా వాయుకాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ఇంట్లో కొవ్వొత్తులు, సిగరెట్ల వంటి పొగకు సంబంధించినవాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. బయటకు వెళ్తే మాస్క్ తప్పకుండా ధరించాలి.
వాయు కాలుష్యాన్ని రంగులను బట్టి చెప్పొచ్చు. ఈ రంగులు పచ్చ నుంచి పసుపు, తర్వాత నారింజ నుంచి ఎరుపు, ఊదా నుంచి ముదురు ఎరుపు (మెరూన్)లోకి మారుతాయి. ఈ రంగులను బట్టి గాలి స్వచ్ఛత తెలుస్తుంది. పచ్చరంగు అన్నింటికన్నా ఉత్తమమైనది.
ప్రతీ పది మరణాల్లో ఒకటి వాయుకాలుష్యం వల్ల సంభవిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి.
వేసవిగాలుల కన్నా చలిగాలులు అత్యంత ప్రమాదకరమైనవి. కాలుష్యాన్ని కలిగి ఉండటంతో ఇవి చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి. దాంతో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువవుతాయి.
స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఐక్యూ ఎయిర్’ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో గాలి నాణ్యత ఎలా ఉందనే సమాచారాన్ని అందజేస్తుంది. రియల్‌టైమ్ సమాచారం కూడా లభిస్తుంది.
‘ఎక్యూఐ’ ఇండెక్స్ ప్రకారం 0-50 ఉంటే స్వచ్ఛమైన గాలి దొరుకుతోందని అర్థం. 51-100 ఉంటే పర్వాలేదు, 101-150 ఉంటే సున్నితం, 151- 200 ఉంటే ప్రమాదకరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్వో) అంచనా ప్రకారం వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది 70 లక్షల ప్రీమెచ్యూర్ మరణాలు సంభవిస్తున్నాయి.