Vitamin Hacks: జుట్టు, చర్మానికి అతి ముఖ్యమైన విటమిన్ ఇదే.. దీన్నెలా పొందాలంటే..
ABN , Publish Date - Nov 06 , 2024 | 04:10 PM
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల విటమిన్లు అవసరం అవుతాయి. వాటిలో చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఇదే..
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి. పండ్లు, కూరగాలు, తృణధాన్యాలు, డ్రై ప్రూట్స్.. ఇలా చాలా వాటిలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఒక్కో విటమిన్ ఒక్కో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. చర్మం ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి కీలకంగా పనిచేసే విటమిన్లలో విటమిన్-ఇ ప్రధానమైనది. ఇంతకీ విటమిన్-ఇ చర్మానికి, జుట్టుకు చేసే మేలు ఏంటి? ఈ విటమిన్ ను ఎలా పొందాలి తెలుసుకుంటే..
విటమిన్-ఇ.. చర్మానికి..
విటమిన్-ఇ ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి తేమను ఇస్తుంది. తద్వారా చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. విటమిన్-ఇ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మీద ముడతలను, మచ్చలను, గీతలను తొలగించడంలో అద్భుతంగా సహాయపడతాయి. అంతేకాదు ఇవి వృద్దాప్య సంకేతాలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ప్రతిరోజూ విటమిన్-ఇ ఆయిల్ ను ముఖానికి అప్లై చేస్తూ ఉంటే పై ఫలితాలు ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా విటమిన్-ఇ పుష్కలంగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోవాలి.
విటమిన్-ఇ.. జుట్టుకు..
విటమిన్-ఇ జుట్టుకు చాలా సహాయపడుతుంది. ఇది జుట్టు ఫోలికల్స్ లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా జుల్టును బలపరుస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని దృఢంగా మారుస్తుంది. జుట్టు రాలడం ఆపుతుంది. జుట్టును మందంగా పెరిగేలా చేస్తుంది. విటమిన్-ఇ ఆయిల్ ను సాధారణ హెయిర్ ఆయిల్ లో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేస్తూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే విటమిన్-ఇ ఆధారిత ఆహారాలు తీసుకుంటూ ఉంటే జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.
విటమిన్-ఇ.. ఆరోగ్యానికి..
విటమిన్-ఇ జుట్టుకు, చర్మానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. చర్మాన్ని అంటు వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది స్వతహాగా యాంటీ ఆక్సిడెంట్ కావడంతో ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
విటమిన్-ఇ ఆహారాలు..
కొన్ని రకాల పండ్లు, కూరగాయలతో పాటు పొద్దు తిరుగుడు విత్తనాలు, సోయా బీన్స్, సోయాబీన్ నూనె, వేరుశనగ, బీట్ రూట్, బచ్చలికూర, గుమ్మడి గింజలు మొదలైన వాటిలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఏదో ఒక ఆహారాన్ని రోజూ తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్-ఇ లభ్యమవుతుంది.