Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!
ABN , Publish Date - Sep 09 , 2024 | 07:36 PM
ఇన్సులీన్ తీసుకునే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇన్సులీన్ పనితీరు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఇన్సులీన్ రకాలు, ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే, దీని ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందగలుగుతారు.
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిక్ రోగులు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇన్సులీన్ తీసుకునే వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇన్సులీన్ పనితీరు, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ ఇన్సులీన్ రకాలు, ఇంజెక్షన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే, దీని ప్రయోజనాలను (Health) పూర్తిస్థాయిలో పొందగలుగుతారు.
ఇన్సులీన్ ఒక హార్మోన్ అన్న విషయం తెలిసిందే. దీన్ని పాంక్రియాస్ ఉత్పత్తి చేస్తాయి. మన శరీరంలోని కణాలు.. రోజువారి పనులకు కావాల్సిన శక్తిని గ్లూకోజ్ నుంచే ఉత్పత్తి చేస్తాయి. ఈ చక్కెరను కణాలు గ్రహించేందుకు ఇన్సులీన్ కీలకం. దీంతో పాటు ఇన్సులీన్ కారణంగా లివర్.. అధికమొత్తంలో ఉన్న గ్లూకోజ్‌ను నిల్వ చేసేందుకు అనువైన గ్లైకోజన్‌గా మారుస్తుంది. అమైనోయాసిడ్లతో ప్రొటీన్ల తయారీని కూడా ఇన్సులీన్ ప్రోత్సహిస్తుంది. కొవ్వు తయారీని కూడా ప్రోత్సహిస్తుంది. సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌ల సమతౌల్యాన్నీ నియంత్రిస్తుంది.
ఇన్సులీన్ రకాలు!
ఇక రక్తంలో చక్కెర స్థాయిలను మరింత సమర్థవంతంగా నియంత్రించేందుకు డాక్టర్లు ఇన్సులీన్ తీసుకోవాలని సూచిస్తారు. అయితే, ఇన్సులీన్ పనిచేసే వేగాన్ని బట్టి మార్కెట్లో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి.
ర్యాపిడ్ యాక్టింగ్ ఇన్సులీన్: ఇది తీసుకున్న 15 నిమిషాల్లోనే ప్రభావం కనిపిస్తుంది. గంట తరువాత దీని ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. రెండు నుంచి నాలుగు గంటల పాటు దీని ప్రభావం నిలిచి ఉంటుంది. తినకముందు దీన్ని తీసుకుంటే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
షార్ట్ యాక్టింగ్ ఇన్సులీన్: ఇది తీసుకున్న అరగంట తరువాత తన పని ప్రారంభిస్తుంది. రెండు మూడు గంటల తరువాత దీని ప్రభావం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. కనీసం మూడు నుంచి ఆరు గంటల పాటు ఇది ప్రభావం చూపుతుంది. చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించేందుకు దీన్ని ఇతర రకాల ఇన్సులీన్‌లతో కలిపి తీసుకుంటారు.
ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఇన్సులీన్:
ఇది తీసుకున్న గంట నుంచి రెండు గంటల తరువాత ప్రభావం మొదలవుతుంది. నాలుగు నుంచి 8 గంటల లోపు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. డోసు తీసుకున్న తరువాత కనీసం 12 గంటల పాటు దీని ప్రభావం నిలిచి ఉంటుంది.
లాంగ్ యాక్టింగ్ ఇన్సులీన్: ఇంజెక్షన్ తీసుకున్న రెండు గంటల తరువాత దీని పని మొదలవుతుంది. దీని ప్రభావం 24 గంటల పాటు నిలిచి ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో డాక్టర్లు రోగులకు రెండు అంతకంటే ఎక్కవ ఇన్సులీన్ రకాలు ఉన్న మిశ్రమాన్ని కూడా సూచిస్తుంటారు. దీన్ని రోజుకు కనీసం రెండు సార్లు తీసుకుంటారు.
ఇక ఇన్సులీన్ నిల్వ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. అయితే, అది గడ్డకట్ట కుండా జాగ్రత్త పడాలి. ఇక ఇన్సులీన్ ఇంజెక్షన్ అంటే నొప్పి ఉంటుందన్నది వాస్తవం కాదని డాక్టర్లు చెబుతున్నారు. తమ సూచనలు పాటిస్తూ చర్మం కింద తీసుకునే ఇంజెక్ష్‌తో ఎటువంటి ఇబ్బందులు రావని అంటున్నారు.