Health News: శరీరంలో ఈ కొవ్వు లేకపోతే చాలా డేంజర్..
ABN , Publish Date - Aug 09 , 2024 | 04:26 PM
మానవ శరీరంలో మంచి, చెడు రెండు రకాల కొవ్వులు ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఒమేగా-3(Omega-3) ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వు పదార్థం చాలా ముఖ్యం. ఇవి తక్కువగా ఉంటే, శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: మానవ శరీరంలో మంచి, చెడు రెండు రకాల కొవ్వులు ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఒమేగా-3(Omega-3) ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వు పదార్థం చాలా ముఖ్యం. ఇవి తక్కువగా ఉంటే, శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒమేగా -3, ఒమేగా -6 శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు. వీటిని పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFAs) అని కూడా అంటారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సాయపడతాయి. శరీరంలో మంటను తగ్గించడానికి ఈ కొవ్వులు ముఖ్యం. ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపలలో అలాగే చియా గింజలు, అవిసె గింజలు, వాల్‌నట్స్‌లలో అధికంగా ఉంటాయి.
శరీరంలోని వివిధ అవయవాలు సక్రమంగా పని చేయడానికి ఒమేగా యాసిడ్లు చాలా ముఖ్యం. వీటితో మెదడు, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవి హార్మోన్ల ఉత్పత్తిలోనూ కీలకంగా వ్యవహరిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌లో మూడు రకాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయకుండా చేస్తాయి. వీటితో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇది ట్రైగ్లిజరైడ్స్‌ని తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది. రక్తం గడ్డకట్టడం, వాపును తగ్గిస్తుంది.
ఒమేగా-3 లోపం లక్షణాలు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపిస్తే, రోగనిరోధక శక్తి తగ్గుతుంది. తరచూ అనారోగ్యానికి గురవుతారు. శరీరం వ్యాధులతో పోరాడలేకపోతుంది.
మహిళలు పీరియడ్స్, గర్భధారణ సమయంలో సమస్యలను ఎదుర్కొంటారు. తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
ఏ పనిపై ఏకాగ్రత సాధించలేరు.
చిరాకు, ఆందోళన వస్తుంది. తరచూ కోప్పడతారు.
మూత్రపిండాల పనితీరును దెబ్బతింటుంది. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి.
కళ్లు పొడిబారుతాయి. కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఉంది. తద్వారా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను మీ డైట్‌లో చేర్చుకుంటే ఈ సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.