Paracetamol: తరచూ 500 ఎంజీ పారాసిటమాల్ వాడుతున్నారా? తెలీక చేస్తున్న తప్పేంటో తెలిస్తే..
ABN , Publish Date - Apr 15 , 2024 | 08:47 PM
పారాసిటమాల్ తరచూ వాడుతుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత సురక్షితమైన నొప్పినివారిణిగా పేరుపడ్డ ఔషధం పారాసిటమాల్ (Paracetamol). ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరికీ తెలిసిన ఔషధం ఇది. మెడికల్ షాపులో ప్రిస్క్రిప్షన్ లేకుండా దీన్ని కొనుక్కోవచ్చు. ఇక అనేక మంది తమకు ఒంట్లో చిన్న ఇబ్బంది కలిగినా పారాసిటమాల్ వాడేస్తుంటారు. కొందరూ తరచూ వీటిని వాడుతూ ఏంకాదని అనుకుంటారు. అయితే, ఇలాంటి భావన తప్పని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. పారాసిటమాల్ వినియోగం వీలైనంతగా పరిమితం చేయాలని చెబుతున్నారు. వైద్యశాస్త్రం ప్రకారం సురక్షితమైన 500 ఏంజీ పారాసిటమాల్ కూడా విచక్షణారహితంగా వాడితే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
సుదీర్ఘకాలం పాటు పారాసిటమాల్ వినియోగంతో ( Effects of Long Term Usage Of Paracetamol) కలిగే ప్రమాదాలపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. తమ పరిశోధన వివరాలను కాలిఫోర్నియాలో జరిగిన అమెరికన్ ఫిజియాలజీ సమ్మిట్‌లో వివరించారు. పారాసిటమాల్ ప్రభావం తెలుసుకునేందుకు వారు ఎలుకలపై పరీక్షలు జరిపారు. ఇందులో భాగంగా కొన్నింటికి ప్రతిరోజూ ఉత్త నీరు, మరికొన్నింటికి 500 ఎంజీ పారాసిటమాల్ కలిపిన నీటిని ఇచ్చారు.
Deep Fried Foods: మరగకాగిన నూనెలతో చేసిన వేపుళ్లు తెగ తింటే.. రిస్క్‌లో పడ్డట్టే!
పారాసిటమాల్ నీరు తాగిన ఎలుకల గుండె కండరాల్లో పలు మార్పులు సంభవించాయి. ముఖ్యంగా గుండె కణాల్లోని 20కిపై సిగ్నలింగ్ పాథ్‌వేలపై పారాసిటమాల్ ప్రతికూల ప్రభావం చూపించింది. శక్తి ఉత్పత్తి, యాంటీఆడ్సిడెంట్‌ల వినియోగం, పాడైన ప్రొటీన్ల తొలగింపు వంటి బయోకెమికిల్ చర్యలపై ప్రభావం పడింది. దీంతో, సుదీర్ఘకాలం పారాసిటమాల్ సాధారణ డోసుల్లో వాడినా గుండె సంబంధిత సమస్యలు (Heart Diseases) వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే, పారాసిటమాల్‌పై పూర్తి అవగాహన కోసం మనుషులపై పరిశోధనలతో కూడిన లోతైన అధ్యయనం అవసరమన్నారు.
వైద్యుల ప్రకారం, పారాసిటమాల్ అధిక డోసుల్లో తీసుకుంటే త్వరగా బరువు తగ్గడం, వాంతులు, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. సుదీర్ఘకాలం పాటు పారాసిటమాల్‌ను వినియోగిస్తే చివరకు కిడ్నీ ఫెయిల్యూర్, పాంక్రియాటైటిస్, లివర్ ఫెయిల్యూర్ బారిన పడాల్సి వస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి