Weight Loss Tips: నీరు ఇలా తాగితే త్వరగా సన్నబడతారు..!
ABN , Publish Date - Jan 08 , 2024 | 07:07 PM
ప్రస్తుత టెక్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులు మీద సాగుతోంది. సమయానికి కనీసం తిండి కూడా తినలేని పరిస్థితి. ఫలితంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.
Weight Loss Tips: ప్రస్తుత టెక్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులు మీద సాగుతోంది. సమయానికి కనీసం తిండి కూడా తినలేని పరిస్థితి. ఫలితంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా స్థూలకాయం, ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే, పెరిగిన బరువును తగ్గడానికి ప్రజలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గక నిరుత్సాహానికి గురవుతుంటారు. అయితే, శరీర బరువు తగ్గించడంలో నీరు అద్భుతంగా ఉపకరిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నీరు దాహం తీర్చడమే కాకుండా.. బరువును కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరించడంతో పాటు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుందంటున్నారు. మరి బరువు తగ్గించడంలో నీరు ఎలా సహాయపడుతుందో ఓసారి తెలుసుకుందాం..
అది ఆకలి కాదు..
రోజులో శరీరానికి సరిపడినన్ని నీళ్లు తాగకపోతే.. ఆటోమేటిక్‌గా మన శరీరం మనకు సంకేతాలను పంపిస్తుంటుంది. అయితే, కొందరికి దాహంగా అనిపిస్తే.. మరికొందరికి ఆకలి వేస్తుంది. వాస్తవానికి ఇది ఆకలి కాదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ ప్రజలు దానిని ఆకలిగా భావిస్తే.. ఎక్కువ ఆహారం తింటారు. అందుకే.. సమయం కాని సమయంలో ఆకలి వేస్తే.. ఆహారం తినడానికి బదులుగా తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. తద్వారా అధిక ఫుడ్‌కు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇక ఆహారం తినే అరగంట ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీని వల్ల బరువు తగ్గడం సులువవుతుంది.
టాక్సిన్స్‌ను బయటకు పంపుతాయి..
శరీరం నుండి విష పదార్థాలను, వ్యర్థాలను తొలగించడంలో నీరు సహాయపడుతుంది. నీటి కారణంగా, శరీరం సహజంగా నిర్విషీకరణ చెందుతుంది. మూత్రం ద్వారా టాక్సిన్స్ బయటకు వెళతాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే సమయంలో బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
జీరో కేలరీస్..
దాహం వేస్తే చాలా మంది అధిక కేలరీలు ఉన్న కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. వీటిలో అధిక చెక్కెరలు, కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గలేరు. వీటికి బదులుగా నీరు తాగితే ప్రయోజనం ఉంటుంది. నీటిలో కేలరీలు ఉండవు. పైగా నీరు తాగడం వలన కడుపు నిండినట్లుగా ఉండటంతో పాటు.. దాహం తీరుతుంది. ఈ కారణంగా బరువు కూడా సులభంగా తగ్గుతుంది.
జీవక్రియను మెరుగు పరుస్తుంది..
రోజూ శరీరానికి అవసరమైన నీరు తాగడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. శరీరం హైడ్రేట్‌గా ఉంటే.. అది పోషకాలను సరిగ్గా గ్రహిస్తుంది. అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. నీరు జీవక్రియ రేటును పెంచుతుంది. బరువును వేగంగా తగ్గిస్తుందని గుర్తించడం జరిగింది.