Electrolyte Imbalance: శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
ABN , Publish Date - Aug 19 , 2024 | 09:54 PM
శరీరంలో ద్రవసమతౌల్యం, కండరాలు, నాడీకణాల పనితీరుకు ఎలక్ట్రోలైట్లు ఎంతో అవసరమని వైద్యులు చెబుతున్నారు. వీటి సమతౌల్యం దెబ్బతిన్న సందర్భాల్లో పలు సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, బైకార్బొనేట్, ఫాస్ఫేట్ వంటి లవణాలు జీవక్రియలకు (Health) చాలా కీలకం. వీటిని శాస్త్రపరిభాషలో ఎలక్ట్రోలైట్స్ అని అంటారు. శరీరంలో ద్రవసమతౌల్యం, కండరాలు, నాడీకణాల పనితీరుకు ఇవి ఎంతో అవసరం. ఇవి శరీరంలో తగు పాళ్లల్లో ఉన్నంతవరకూ జీవక్రియలన్నీ సవ్యంగా సాగిపోతుంటాయి. కానీ, ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు తగ్గి అసమతౌల్యం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
Health: ప్రీబయోటిక్స్.. ప్రోబయోటిక్స్.. ఈ రెండిటి మధ్య తేడా తెలుసా?
ఎలక్ట్రోలైట్స్ అసమతౌల్యానికి కారణాలు..
పోషకాహార లేమి, తగినంత నీరు తీసుకోకపోవడం తదితర కారణాల రీత్యా శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు ఎగుడుదిగుడులకు లోనవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీంతో, కండరాల నొప్పులు, నీరసం, గుండె కొట్టుకోవడంలో సమస్యలతో పాటు ఒక్కోసారి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి కండరాల సంకోచవ్యాకోచాలకు కీలకం. వీటి సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు కండరాలు పట్టేసినట్టు ఉండటం, నొప్పులు, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి.
గుండె కండరాల్లో విద్యుత్ ప్రవాహం సవ్యంగా సాగేందుకు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తాయి. వీటి మధ్య సమతౌల్యం దెబ్బతింటే.. గుండె దడ, గుండెకొట్టుకునే తీరులో మార్పులు, ఛాతిలో ఇబ్బంది తదితర సమస్యలు మొదలవుతాయి.
శరీరంలో నీటి స్థాయిలు నియంత్రించేందుకు సోడియం అవసరం. సోడియం స్థాయిలు తగ్గితే డీహైడ్రేషన్ బారినపడతారు. నోరు ఎండిపోయినట్టు ఉండటం, తరచూ దాహం వేయడం, మూత్ర విసర్జన తగ్గడం వంటివి తలెత్తుతాయి.
సోడియం, పొటాషియం మధ్య సమతౌల్యం దెబ్బతిన్నప్పుడు రక్తపోటులో మార్పులు వస్తాయి. తలతిరిగినట్టు ఉండటం, దడ, స్పృహ తప్పడం వంటివి సంభవించవచ్చు
ఎలక్ట్రోలైట్ల స్థాయిల్లో సమతౌల్యం లేనప్పుడు కడుపులో తిప్పడం, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నాడీ కణాల పనితీరుకు కీలకమైన ఎలక్ట్రోలైట్లు తగ్గినప్పుడు మెదడు పని తీరు కూడా కుంటుపడుతుంది. ఏకాగ్రత లోపించడం, చీరాకు పెరగడం, వంటి సమస్యలు వస్తాయి.
శరీరంలో శక్తి ఉత్పత్తికి కూడా ఎలక్ట్రోలైట్లు అవసరం. వీటి స్థాయిలు తగ్గినప్పుడు నీరసం వేధిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక ఎముకల ఆరోగ్యానికి కాల్షియం కీలకమన్న విషయం తెలిసిందే. కాల్షియం తగ్గిన సందర్భాల్లో ఎముకల సాంద్రత తగ్గి అవి విరిగే అవకాశాలు పెరుగుతాయి.