Share News

Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:38 PM

తీరిక లేక లేదా ఇతర కారణాలతో తరచూ తిండి మానేసే వారిలో అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.

Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!

ఇంటర్నెట్ డెస్క్: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తీరిక లేదంటూ ఓ పూట తిండి మానేసేవారు ఎందరో ఉన్నారు. కొందరు తరచూ ఇలా చేస్తుంటారు. ఈ చర్యలతో పెను ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వారంలో ఏదోక రోజు చేసే ఉపవాసాలతో ప్రయోజనాలు (Health) ఉన్నప్పటికీ పద్ధతి లేకుండా తిండి మానేస్తే అనర్థాలు తప్పవంటున్నారు.

తరచూ తిండి మానేస్తుంటే జరిగేది ఇదే..

తిండి మానేస్తే వెంటనే రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోతుంది. దీంతో, నీరసం, అలసట, చికాకు పెరుగుతాయి. దీన్ని వైద్య పరిభాషలో హ్యంగర్ అని అంటారు. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సన్నగిల్లుతాయి. మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం (what happens to your body when you skip meals).


తిండి మానేస్తే బరువు తగ్గొచ్చనేది చాలా మంది నమ్మకం. అయితే, ఓ క్రమ పద్ధతి లేకుండా భోజనం తినడం మానేస్తూ ఉంటే క్రమంగా బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. గ్లూకోజ్ తగినంతగా అందుబాటులో లేకపోవడంతో శరీరం తన తీరు మార్చుకుంటుందని, శక్తిని నిల్వ చేసుకునే క్రమంలో కొవ్వు పేరుకుంటుందని, జీవక్రియల వేగం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అంతిమంగా, ఇలాంటి వారు బరువు పెరుగుతారట. ఓ పూట తిండి మానేస్తే ఆ తరువాత లోటును పూడ్చుకునేందుకు తెలీకుండానే ఎక్కువ తినేస్తారట.

తరచూ ఓ పూట తిండి మానేసేవారిలో క్రమంగా కండరాలు క్షీణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గ్లూకోజ్ స్థాయిలో హెచ్చు తగ్గుల కారణంగా శరీరం ఇతర శక్తి వనరులపై దృష్టి పడుతుందని చెబుతున్నారు. ఫలితంగా కండరాల్లోని ప్రొటీన్ ఇంధనంగా మారుతుంది. దీంతో, చూస్తుండగానే కండరాలు కరిగి పటుత్వం తగ్గిపోతుంది.

తిండి మానేయడం మానసిక ఆరోగ్యానికీ చేటేనని వైద్యులు చెబుతున్నారు. టైంకు తినకపోతే శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుందని, ఫలితంగా చిరాకు, ఆందోళన ఎక్కువవుతాయట.


ఎప్పుడుపడితే అప్పుడు తిండి మానేసే వారిలో పోషకాల లోపం కూడా తలెత్తుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు. కాల్షియం, ఇరన్, పీచు పదార్థాల వంటివి తగినంత అందక దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రోగ నిరోధక శక్తి, ఎముకలు బలహీనపడటం, రక్తహీనత వస్తాయని చెబుతున్నారు.

తరచూ తిండి మానేసేవారిలో షుగర్, హృద్రోగాలు, ఊబకాయం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. తరచూ బ్రేక ఫాస్ట్ తినకపోతే గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఏర్పడుతుంది. ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరిగి టైప్ 2 డయాబెటిస్ బారిన పడొచ్చు.

ఈ దురలవాటుతో పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కడుపులో హితకర బ్యాక్టీరియాకు హాని కలగడంతో అనేక ఇతర అనారోగ్యాలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు.

Read Health and Latest News

Updated Date - Sep 10 , 2024 | 03:45 PM