Share News

చలికాలం... మేలు చేసే సూపులేవి?

ABN , Publish Date - Dec 08 , 2024 | 10:46 AM

చలికాలంలో ఆహారం వేడిగా తీసుకోవాలనిపిస్తుంది. పొగలు కక్కుతూ, స్పైసీగా ఉండే సూప్స్‌ అంటే అంతా ఇష్టపడతారు. క్యారెట్‌, గుమ్మడికాయ, టమాటా, ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, పాలకూర, పచ్చి బఠాణీ, బ్రకోలీ, క్యాప్సికం... ఇలా సూప్స్‌ను అన్ని రకాల కూరగాయలతో తయారు చేసుకోవచ్చు.

చలికాలం... మేలు చేసే సూపులేవి?

చలికాలంలో మేలు చేసే సూపులేమిటి? పిల్లలకు అదనపు పోషకాలు అందించడానికి సూపుల్లో ఏవేవి చేర్చుకోవచ్చు?

- శ్రీశైలం, హైదరాబాద్‌

చలికాలంలో ఆహారం వేడిగా తీసుకోవాలనిపిస్తుంది. పొగలు కక్కుతూ, స్పైసీగా ఉండే సూప్స్‌ అంటే అంతా ఇష్టపడతారు. క్యారెట్‌, గుమ్మడికాయ, టమాటా, ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, పాలకూర, పచ్చి బఠాణీ, బ్రకోలీ, క్యాప్సికం... ఇలా సూప్స్‌ను అన్ని రకాల కూరగాయలతో తయారు చేసుకోవచ్చు. విడివిడిగా కానీ కొన్ని రకాల కూరగాయలను కలిపి కానీ సూప్‌ తయారుచేయొచ్చు. మాంసాహారం తినేవారైతే ఎగ్‌ సూప్‌, చికెన్‌ సూప్‌, మటన్‌ సూప్‌ వంటివి కూడా చేసుకోవచ్చు. సూప్స్‌ చిక్కగా వచ్చేందుకు కార్న్‌ఫ్లోర్‌ లేదా మైదా పిండి వాడడం కంటే కూరగాయలను ఉడికించేప్పుడు వాటితో పాటు చిన్న బంగాళాదుంప ముక్క వేసి ఉడికించు కొని... దానితో పాటే గ్రైండ్‌ చేసుకుంటే సరిపోతుంది. రుచి కొరకు ధనియాల పొడి, మిరియాలపొడి, అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, పుదీనా, కొత్తిమీర వంటివి వాడితే బాగుంటుంది. పిల్లల కోసమైతే అదనపు పోషకాలకు పన్నీర్‌ లేదా సోయా పన్నీర్‌ ముక్కలు, మీల్‌మేకర్‌ ముక్కలు, ఉడికించిన సెనగలు, రాజ్మా, అలసందలు వంటివి సూప్స్‌లో వేసుకుంటే బాగుంటుంది.


మా నాన్నగారి వయసు 62 ఏళ్ళు. గత కొన్నాళ్లుగా ఆయన మలబద్దకంతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చా?

- నిరంజన్‌, భీమవరం

మలబద్దకం సమస్యను కొంతమేరకు అధికంగా పీచుపదార్థం ఉన్న ఆహారం తీసుకోవడంతో అధిగమించవచ్చు. ఆహారంలో పీచుపదార్థం కేవలం పచ్చి కూరల నుంచి మాత్రమే కాకుండా పలు రకాల పప్పుల్లో, ముడిధాన్యాల్లో కూడా ఉంటుంది. తెల్ల బియ్యం కంటే కూడా బ్రౌన్‌ రైస్‌ లేదా ఎర్ర బియ్యంలో కూడా పీచు పదార్థం ఉంటుంది. ఆహారంలో బియ్యానికి బదులుగా చిరుధాన్యాలైన రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు మొదలైన వాటిని తీసుకుంటే కూడా ఉపయోగం ఉంటుంది. అలాగే, రకరకాల పళ్లలో కూడా పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా జామ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి ప్రతి రోజూ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. అరటిపండు కూడా మలబద్దకం నివారించడానికి ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా రోజూ రెండు అంజీర్‌ పండ్లు (ఎండు అంజీర్‌) తీసుకుంటే సమస్య తీరుతుంది. రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పైన జాగ్రత్తలన్నింటితో పాటుగా ప్రతీ ఉదయం కొంచెం వేడినీళ్లు తీసుకుంటే కూడా మలబద్దకం సమస్య పరిష్కారమవుతుంది. వీటన్నింటితో పాటు, వైద్యుల సలహా తీసుకొని ఏదైనా ఫైబర్‌ సప్లిమెంట్‌ తీసుకోవడమూ మంచిదే.


మా బంధువుల ఇంట్లో రిఫైన్డ్‌ నూనెల బదులు కుసుమ నూనె వాడుతున్నారు. అలాగే ఇంకొందరు ఆలివ్‌నూనె వాడుతున్నారు. వీటి ప్రత్యేకతలేమిటి? ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

- శోభ, రాజమండ్రి

కుసుమ నూనె కూడా ప్రొద్దుతిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌) వలెనే మోనో, పోలీ అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటుంది. ఫ్యాటీ యాసిడ్స్‌ తగిన పరిమితుల్లో తీసుకొంటే గుండె ఆరోగ్యానికి మంచిది. గానుగ కుసుమ నూనెలో రిఫైన్డ్‌ ఆయిల్‌ కన్నా యాంటీ ఆక్సిడెంట్లు కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే గానుగ కుసుమ నూనెలో విటమిన్‌ ఈ కూడా అధికంగా ఉంటుంది. మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉన్న నూనెలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని కొన్ని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆలివ్‌నూనెలో మిగతా నూనెలతో పోల్చినప్పుడు ఈ మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. కానీ అన్ని రకాల ఆలివ్‌నూనెలూ అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసేందుకు అనుగుణ మైనవి కావు. ఆలివ్‌నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాడినప్పుడే దాని ఆరోగ్యఫలితాలు మనకందుతాయి. వేపుళ్ళు, డీప్‌ ఫ్రై వంటి వాటికి ఆలివ్‌నూనె వాడకపోవడం మంచిది. నూనె ఏదైనా సరే రోజుకు మనిషికి 20-25 గ్రాములకు మించి వాడకపోవడం ఉత్తమం. అవసరానికి మించి వాడినప్పుడు గానుగ నూనె అయినా రిఫైన్డ్‌ నూనె అయినా ఆరోగ్యానికి అనర్ధమే.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Dec 08 , 2024 | 10:46 AM