Share News

Yoga asana: బలహీనంగా మారిన నరాలకు బలాన్నిచ్చే యోగాసనాలు ఇవీ..!

ABN , Publish Date - Apr 11 , 2024 | 03:18 PM

ఈ మధ్యకాలంలో చాలామందిలో నరాల బలహీనత ఎదురవుతోంది. దీన్ని అధిగమించాలంటే ఈ ఆసనాలు బెస్ట్

Yoga asana: బలహీనంగా మారిన నరాలకు బలాన్నిచ్చే యోగాసనాలు ఇవీ..!

నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్యకరమైన దినచర్య కారణంగా ఎముకలు బలహీనపడటం, జుట్టు రాలడం, చర్మం చిన్న వయసులోనే ముడతలు పడటం మొదలైన సమస్యలు కనిపిస్తాయి. వీటితో పాటూ నరాలు కూడా బలహీనంగా మారతాయి. అయితే కొన్ని యోగా ఆసనాలను రోజూ వేస్తుంటే బలహీన పడిన నరాలకు తిరిగి శక్తి వస్తుంది. నరాలు ఆరోగ్యంగా మారతాయి. ఇంతకీ నరాలకు బలాన్నిచ్చే ఆసనాలేంటో తెలుసుకుంటే..

బద్దకోనాసనం..

బద్దకోనాసనం వేయడానికి ముందు యోగా మ్యాట్ లేదా మెత్తని వస్త్రం పరుచుకుని దాని మీద కూర్చోవాలి. కాళ్లను నిటారుగా ఉంచి కూర్చోవాలి. మోకాళ్లను వంచి రెండు పాదాల అరికాళ్లను ఎదురెదురుగా ఉంచి ఆనించాలి. ఇప్పుడు రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఈ పొజిషన్ లో ఉండి రెండు కాళ్లను పైకి కిందకు కదపాలి. ఈ ఆసనాన్ని రోజూ 5 నిమిషాలు వేయచ్చు.

ఇది కూడా చదవండి: వేసవికాలంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి!


హలాసనం..

హలాసనం వేయడానికి ముందు వెల్లికిలా పడుకోవాలి. చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. రెండు కాళ్లను ఆనించి మెల్లిగా పైకి లేపి లంబకోణంలోకి తీసుకుని రావాలి. ఆ తరువాత పాదాలను తల వెనుకగా తీసుకొచ్చి తల వెనుక నేలకు పాదాలు తగిలేలా చెయ్యాలి. ఈ ఆసనం వేసేటప్పుడు పాదాలు నిటారుగా ఉండాలి. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా నేలకు ఆనించి ఉంచాలి.

వజ్రాసనం..

ముందుగా మోకాళ్లను వంచి కూర్చోవాలి. వెన్ను, తల నిటారుగా ఉండాలి. అరచేతులు మోకాళ్లపై ఉంచాలి. 5నిమిషాలు ఇదే స్థితిలో కూర్చోవాలి. ఈ స్థితిలో ఉండి లోతైన శ్వాస తీసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 11 , 2024 | 03:18 PM