Syria: దేశగతిని మార్చేసిన 14 ఏళ్ల బాలుడు.. ఒక్క స్లోగన్‌తో 50 ఏళ్ల రాచరికానికి చెక్
ABN , Publish Date - Dec 09 , 2024 | 02:28 PM
Syria: సిరియాలో అంతర్యుద్ధం ముగిసింది. దాదాపు 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన అసద్ కుటుంబ పాలనకు చెక్ పడింది. అయితే ఈ పాలన అంతానికి ఒక 14 ఏళ్ల కుర్రాడు బీజం వేయడం గమనార్హం.
సిరియాలో అంతర్యుద్ధం ముగిసింది. దాదాపు 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన అసద్ కుటుంబ పాలనకు చెక్ పడింది. అయితే ఈ పాలన అంతానికి ఒక 14 ఏళ్ల బాలుడు బీజం వేయడం గమనార్హం. సుమారు 13 ఏళ్ల కింద ఆ కుర్రాడు ఇచ్చిన ఓ నినాదం స్ఫూర్తితో లక్షలాది మంది పోరాడారు. ఆ స్లోగన్ ఇన్‌స్పిరేషన్‌తో నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు అక్కడి ప్రజలు. ఇంతకీ ఎవరా బాలుడు? సిరియా స్థితిగతుల్ని అతడు ఎలా మార్చాడు? అతడు ఇచ్చిన నినాదం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
అక్షరాలు మార్చేశాయ్
2011 సంవత్సరంలో మొదలైన అరబ్ స్ప్రింగ్ తిరుగుబాటు తీవ్రతను పాలకుడు అసద్ గుర్తించలేదు. అప్పట్లో నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆ తీవ్రత కాస్తా దశాబ్ద కాలానికి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి పారిపోయాడు. అయితే దీనంతటికీ 2010-11లో జరిగిన ఒక ఘటనే కారణం. ఆ ఏడాది ట్యునీషియాలో ఒక వీధి వ్యాపారితో ఓ అధికారి దురుసుగా ప్రవర్తించాడు. ఆ వ్యాపారి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ప్రజల ఆందోళనలు మొదలై నియంత అసద్‌ను గద్దె దించే వరకు సాగాయి. 2011 ఫిబ్రవరి 26న 14 ఏళ్ల మౌవియా సియాస్నే అనే బాలుడు ఒక రోజు స్కూల్ గోడ మీద ‘ఎజాక్ ఎల్ దూర్ యు డాక్టర్’ అని పెద్ద అక్షరాలతో రాశాడు.
13 ఏళ్లు అంతర్యుద్ధం
మౌవియా సియాస్నే రాసిన వ్యాఖ్యకు ‘ఇప్పుడు నీ వంతు వచ్చింది’ అనేది అర్థం. ఈ రాతలు అతడు ఆవేశంలో, బాధలో రాసినవి. తక్కువ సమయంలోనే అవి దేశాన్ని మార్చేశాయి. ఈ రాత విషయం అసద్ అనుచరులకు తెలియడంతో అక్కడ ఉన్న దాదాపు 20 మంది పిల్లల్ని దళాలు బంధించి తీసుకెళ్లాయి. ఆ పిల్లల్ని నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. పిల్లల పేరెంట్స్ ఎంత మొత్తుకున్నా కనికరించలేదు. దీంతో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగారు. వారిని జైళ్లలో వేయడంతో దేశం అట్టుడికిపోయింది. చివరకు 26 రోజుల తర్వాత ఆ పిల్లల్ని విడిచిపెట్టారు. అప్పటి నుంచి ఫ్రీ సిరియా ఆర్మీగా ఏర్పడి అసద్ కుటుంబంపై పోరాటానికి దిగాయి. దాదాపు 13 ఏళ్ల పాటు జరిగిన అంతర్యుద్ధం తర్వాత ఎట్టకేలకు నియంత పాలన నుంచి సిరియాకు విముక్తి లభించింది.
Also Read:
ఈ దేశం వెళ్లొద్దని భారత ప్రజలకు ప్రభుత్వం సూచన.. కారణమిదే..
హిందువులపై దాడులు.. బంగ్లాదేశ్‌కు విదేశాంగ కార్యదర్శి
హమ్మయ్య.. ఎట్టకేలకు పని చేస్తున్న రైల్వే వెబ్‌సైట్..
For More International And Telugu News