Share News

Bangladesh: నెత్తురోడుతున్న బంగ్లాదేశ్.. ఒకే రోజు 72 మంది మృతి! హసీనా రాజీనామా?

ABN , Publish Date - Aug 04 , 2024 | 07:36 PM

రిజర్వేషన్ల రగడ బంగ్లాదేశ్‌ని(Bangladesh clashes) భూభాగాన్ని రక్తసిక్తం చేస్తోంది. ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి.

Bangladesh: నెత్తురోడుతున్న బంగ్లాదేశ్.. ఒకే రోజు 72 మంది మృతి! హసీనా రాజీనామా?

ఢాకా: రిజర్వేషన్ల రగడ బంగ్లాదేశ్‌ని(Bangladesh clashes) భూభాగాన్ని రక్తసిక్తం చేస్తోంది. ప్రభుత్వ రిజర్వేషన్లను సవరించాలని జరుగుతున్న ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే రాజధాని ఢాకా సహా బంగ్లాదేశ్‌లోని అనేక నగరాల్లో హింసాకాండ చెలరేగింది. నిరసనకారులు.. పోలీసులు, అధికార పార్టీ కార్యకర్తలతో ఘర్షణ పడడంతో ఆదివారం 72 మందికి పైగా మరణించారు.

వందల సంఖ్యలో గాయపడ్డారు. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన వేలాది మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగిస్తున్నారు. అయితే నిరసనకారులను అడ్డుకునేందుకు ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్త కర్ఫ్యూను విధించింది.


రాజీనామా దిశగా హసీనా?

బంగ్లాదేశ్‌ని 15 ఏళ్లకు పైగా పాలిస్తూ ఈ ఏడాది జనవరిలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన హసీనాకు ఈ నిరసనలు పెను సవాలుగా మారాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుండటంతో హసీనా ప్రభుత్వం పతనం అంచున ఉన్నట్లు కనిపిస్తోంది. పోలీసుల దాడుల్లో నిరసనకారులు పదుల సంఖ్యలో చనిపోతుండటంతో షేక్ హసీనా రాజీనామా చేసే పరిస్థితులు వచ్చాయని నిపుణులు అంటున్నారు.

ఢాకా సెంట్రల్ షాబాగ్ స్క్వేర్‌లో కర్రలు పట్టుకుని నిరసనకారులు గుమిగూడారు. రాజధానితోపాటు అనేక జిల్లాల రహదారులను నిరసనకారులు మూసేస్తున్నారు. వారంతా పోలీసులతో ఘర్షణ పడుతున్నారు. అధికార అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.


అణచివేతలు..

నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. పన్నులు, వినియోగదారుల బిల్లులు చెల్లించవద్దని, ఆదివారం సైతం పనులకు హాజరుకాకూడదని ఆ దేశ ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌పీ ప్రజలను కోరింది. వెదురు కర్రలను ఆయుధాలుగా మలుచుకుని పోలీసులను ఎదుర్కోవాలని సూచించింది. ఢాకాలోని ప్రభుత్వ ఆసుపత్రి బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్శిటీతో సహా పలు కార్యాలయాలు, సంస్థలపై నిరసనకారులు దాడి చేశారు. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలో బాంబులు, తుపాకుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిరసనకారులు పలు వాహనాలను తగలబెట్టారు.

ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..

మళ్లీ నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లా ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 4G సేవలను నిలిపేయాలని తమకు ఆదేశాలు అందాయని ఫోన్ ఆపరేటర్ల అధికారులు తెలిపారు. సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు విధించారు.

Updated Date - Aug 04 , 2024 | 08:25 PM