Share News

US-UK Strikes: హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:39 AM

ఇరాన్ సహకారంతో సముద్రంలో వాణిజ్య నౌకలపై పదేపదే దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుదారులకు అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ శనివారం గట్టి షాక్ ఇచ్చాయి. యెమెన్‌లో హౌతీ రెబల్స్‌కు చెందిన 36 స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి.

US-UK Strikes: హౌతీ రెబల్స్ స్థావరాలపై అమెరికా, యూకే దాడులు

వాషింగ్టన్: ఇరాన్ సహకారంతో సముద్రంలో వాణిజ్య నౌకలపై పదేపదే దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుదారులకు అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ శనివారం గట్టి షాక్ ఇచ్చాయి. యెమెన్‌లో హౌతీ రెబల్స్‌కు చెందిన 36 స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశాయి.

అంతర్జాతీయ రవాణా, వాణిజ్య షిప్పింగ్‌తో పాటు ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణించే నౌకలపై హౌతీ రెబల్స్ పదే పదే దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ చర్యకు దిగాయి. యెమెన్‌లోని 13 ప్రదేశాలలో 36 హుతీ లక్ష్యాలను లక్ష్యంగా దాడుల చేశామని అమెరికా, బ్రిటన్‌తో పాటు ఆపరేషన్‌కు మద్దతు తెలిపిన ఇతర దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించామని, ప్రపంచ వాణిజ్యాన్ని, అమాయక నావికులను బెదిరించడానికి హుతీలు ఉపయోగిస్తున్న శక్తిసామర్థ్యాలపై దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఈ దాడి చేశామని వెల్లడించాయి. హౌతీల ఆయుధాల నిల్వ సౌకర్యాలు, క్షిపణి వ్యవస్థలు, లాంచర్లు, వాయు రక్షణ వ్యవస్థలు, రాడార్‌లతో సంబంధం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపామని వివరించాయి.

కాగా ప్రపంచ వాణిజ్యానికి హౌతీ తిరుగుబాటుదారులు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. జనవరి 28న జోర్డాన్‌లో ముగ్గురు అమెరికా సైనికులను చంపినందుకు ప్రతిస్పందనగా ఇరాక్, సిరియాలో ఇరాన్-సంబంధిత లక్ష్యాలపై అమెరికా దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసింది. ఆ తర్వాత యెమెన్‌లో కూడా దాడులు నిర్వహిస్తోంది.

Updated Date - Feb 04 , 2024 | 11:39 AM