తప్పుడు కేసు పెట్టి.. నిర్బంధించి..
ABN , Publish Date - Oct 26 , 2024 | 03:39 AM
ఆఫ్రికా వ్యాప్తంగా పేరొందిన ఓస్వాల్ గ్రూపు కంపెనీల వారసురాలు వసుంధర ఓస్వాల్ అరెస్టు వ్యవహారం.. ఇప్పుడు అక్కడ సంచలనం సృష్టిస్తోంది.
ఉగాండాలో ఓస్వాల్ గ్రూపు కంపెనీల వారసురాలు వసుంధర అరెస్టు
వంటమనిషి ‘హత్య’ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు
ఖండించిన ఓస్వాల్ కుటుంబం
వంట మనిషి బతికే ఉన్నాడని వెల్లడి
లండన్, అక్టోబరు 25: ఆఫ్రికా వ్యాప్తంగా పేరొందిన ఓస్వాల్ గ్రూపు కంపెనీల వారసురాలు వసుంధర ఓస్వాల్ అరెస్టు వ్యవహారం.. ఇప్పుడు అక్కడ సంచలనం సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసున్న వసుంధర.. ఈ నెల 1వ తేదీన ఉగాండాలోని తమ ఫ్యాక్టరీని సందర్శించిన సమయంలో దాదాపు 20 మంది పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఓస్వాల్ కుటుంబంలో సహాయకుడిగా పని చేసిన ముఖేశ్ మేనరియా హత్యకు గురయ్యాడని, దీంట్లో వసుంధర ప్రమేయం ఉందని అభియోగాలు మోపారు. దాంతోపాటు పలు కార్పొరేట్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఆమె సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. లండన్‌లో ఉన్న ఓస్వాల్ గ్రూపు కంపెనీల అధిపతి పంకజ్ ఓస్వాల్.. కుమార్తె అరెస్టు విషయం తెలిసి హతాశుడయ్యారు. వసుంధరను సురక్షితంగా విడిపించటం కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఉగాండా అధ్యక్షుడు యొవేరి ముసెవేనికి లేఖ రాశారు. ముఖేశ్ మేనరియా తమ వద్ద వంట మనిషిగా పని చేసేవాడని, దాదాపు రెండు లక్షల డాలర్లు అప్పు తీసుకున్నాడని, తమ ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించాడని లేఖలో పేర్కొన్నారు. అప్పు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి, తమ మీద కిడ్నాప్, హత్య ఆరోపణలు చేశాడని తెలిపారు.
పోలీసులు చెబుతున్నట్లుగా ముఖేశ్ హత్యకు గురి కాలేదని, టాంజానియాలో ఉన్నాడని తెలిపారు. వసుంధరను చట్టవ్యతిరేకంగా నిర్బంధించారని, ఆమెను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితికి కూడా ఈ విషయమై విన్నవించారు. అయినప్పటికీ, వసుంధర విడుదల విషయంలో ముందడుగు పడకపోవటంతో పంకజ్ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. వసుంధరను అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్న జైళ్లలో నిర్బంధిస్తున్నారని, తరచూ జైళ్లు మారుస్తున్నారని, సురక్షిత తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించటం లేదని వసుంధర చెల్లెలు రిధి ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్టు చేసిన తర్వాత కొన్ని రోజులపాటు స్నానం చేయటానికి, బట్టలు మార్చుకోవటానికి కూడా ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. వసుంధరను ఉగాండాకు ఎందుకు పంపించామా అని తమ తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడుతున్నారని తెలిపారు. ఉగాండాకు వెళ్తే వారినీ అక్కడి అవినీతి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని, అందుకనే ఒక రహస్య ప్రదేశంలో ఉంటూ వసుంధర విడుదల కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారని వెల్లడించారు. భారతీయ మూలాలున్న అభయ్ కుమార్ ఓస్వాల్.. ఓస్వాల్ కంపెనీని స్థాపించి పలు ఆఫ్రికా దేశాల్లో విస్తరించారు. ఆయన కుమారుడే పంకజ్ ఓస్వాల్. వీరి కుటుంబం స్విట్జర్లాండ్‌లో నివసిస్తోంది.