Share News

గళమెత్తిన బంగ్లా హిందువులు

ABN , Publish Date - Oct 27 , 2024 | 03:31 AM

రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్‌ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు.

గళమెత్తిన బంగ్లా హిందువులు

  • చిట్టగాంగ్‌లో వేలాదిమందితో భారీ ర్యాలీ

  • మైనారిటీల హక్కుల రక్షణకు ఆందోళన

  • తాత్కాలిక ప్రభుత్వానికి 8 డిమాండ్లు

ఢాకా, అక్టోబరు 26: రాజకీయ సంక్షోభంతో అధికారం చేతులు మారిన బంగ్లాదేశ్‌లో.. హిందువులు గళమెత్తారు. షేక్‌ హసీనా ప్రభుత్వం అనంతరం తొలిసారి భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది శుక్ర, శనివారాల్లో చిట్టగాంగ్‌లోని వీధుల్లోకి వచ్చారు. మైనారిటీల హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. సనాతన జాగరణ మంచ్‌ ఆధ్వర్యంలో సాగిన ఈ ఆందోళనలో మొమహ్మద్‌ యూనస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వానికి తమ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు సహా 8 డిమాండ్లు విధించారు.

మైనారిటీలపై దాడులకు పాల్పడినవారిని త్వరగా శిక్షించేందుకు ట్రైబున్యల్‌ ఏర్పాటు, అల్లర్ల బాధితులకు పరిహారం, పునరావాసం కల్పన, మైనారిటీల రక్షణ చట్టం, విద్యా సంస్థలు, వసతి గృహాల్లో మైనారిటీలు ప్రార్థనలు-పూజలు చేసుకునేందుకు ప్రత్యేక వసతులు, హిందూ, బుద్ధిస్ట్‌, క్రిస్టియన్‌ సంక్షేమ ట్రస్ట్‌ల బలోపేతం బంగ్లా మైనారిటీల ప్రధాన డిమాండ్లు. దుర్గా పూజ ఉత్సవాలకు ఐదు రోజుల సెలవు, సంస్కృతం, పాలీ విద్యల బోర్డును ఆధునికీకరించాలని కోరుతున్నారు. కాగా, ఆగస్టు 5న హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆందోళనకారులు బంగ్లాదేశ్‌లోని మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

చర్యలు తీసుకుంటామని తాత్కాలిక ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇటీవలి కాలంలో ఆస్తుల లూటీతో పాటు భౌతిక దాడులూ పెరిగిపోయాయి. కాగా, బంగ్లా హిందువులు అక్కడి నుంచి పారిపోకూడదని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే అన్నారు. వారి రక్షణకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బంగ్లా హిందువుల భద్రతకు ఐక్యరాజ్యసమితి హామీ ఇవ్వాలని కోరారు

Updated Date - Oct 27 , 2024 | 03:31 AM