Share News

Bangladesh : హసీనాను మాకు అప్పగించండి

ABN , Publish Date - Dec 24 , 2024 | 06:29 AM

మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ మేరకు భారత్‌కు దౌత్య లేఖను పంపామని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం సోమవారం

Bangladesh : హసీనాను మాకు అప్పగించండి

భారత్‌ను కోరిన బంగ్లాదేశ్‌

లేఖ అందిందన్న భారత అధికార వర్గాలు

ఢాకా, డిసెంబరు 23: మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌ను కోరింది. ఈ మేరకు భారత్‌కు దౌత్య లేఖను పంపామని బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఈ ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలో నివసిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన సందర్భంగా నరమేధానికి పాల్పడ్డారంటూ హసీనాతోపాటు నాటి కేబినెట్‌ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ, పౌర అధికారులు అనేకమందిపై బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. వారందరిపై బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌(ఐసీటీ) అరెస్టు వారెంట్లు కూడా జారీ చేసింది. హసీనాపై 42 హత్య కేసులు సహా మొత్తం 51 కేసులను నమోదు చేశారు. కేసుల విచారణ నిమిత్తం హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపాలని భారత ప్రభుత్వానికి సందేశం పంపామని బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్‌ హొస్సేన్‌ సోమవారం విలేకరులకు తెలిపారు. ఇరుదేశాల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని, ఆ ఒప్పందం ప్రకారమే హసీనాను వెనక్కి తీసుకొస్తామని తెలిపారు. నేరస్తుల అప్పగింత ఒప్పందంపై 2013లో ఇరుదేశాలు సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్‌ లేఖ పంపిన విషయాన్ని భారత్‌ కూడా ధ్రువీకరించింది. ‘బంగ్లాదేశ్‌ రాయబారి కార్యాలయం నుంచి ఈరోజే లేఖ అందింది’ అని భారత అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 24 , 2024 | 06:29 AM