Share News

Bangladesh : రికార్డు విజయం నుంచి పలాయనం దాకా

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:20 AM

స్వాతంత్య్రం కోసం పోరాడి.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి.. సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు, సోదరులను కోల్పోయి.. భారత్‌లో ప్రవాసంలో గడిపి.. మాతృభూమికి తిరిగెళ్లి.. ప్రధానిగా రికార్డు కాలం పనిచేసిన షేక్‌ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Bangladesh : రికార్డు విజయం నుంచి పలాయనం దాకా

  • విద్యార్థిగానే రాజకీయాల్లోకి హసీనా.. 5 సార్లు ప్రధానిగా ఎన్నిక

ఢాకా, ఆగస్టు 5: స్వాతంత్య్రం కోసం పోరాడి.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి.. సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు, సోదరులను కోల్పోయి.. భారత్‌లో ప్రవాసంలో గడిపి.. మాతృభూమికి తిరిగెళ్లి.. ప్రధానిగా రికార్డు కాలం పనిచేసిన షేక్‌ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బంగ్లా జాతిపిత షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ కుమార్తె అయిన ఈమె.. భారత్‌-పాక్‌ విభజన జరిగాక 1947 సెప్టెంబరులో జన్మించారు.

1960ల చివరలో పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్య్రం కావాలంటూ బంగ్లా ప్రజలు సాగించిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తండ్రిని పాక్‌ పాలకులు జైలులో పెట్టగా.. ఆయన స్థాపించిన అవామీ లీగ్‌ పార్టీ బాధ్యతలను చూశారు.

1971లో దేశానికి స్వాతంత్య్రం అనంతరం ముజిబుర్‌ తొలుత అధ్యక్షుడు, తర్వాత ప్రధాని అయ్యారు. మరో నాలుగేళ్లకే ఆయనతో పాటు భార్య, ముగ్గురు కొడుకులను సైన్యం అధికారిక నివాసంలోనే చంపేసింది. చెల్లెలు రెహానాతో కలిసి విదేశాల్లో ఉండడంతో హసీనా ప్రాణాలు దక్కించుకున్నారు. స్వదేశానికి వెళ్లలేని పరిస్థితుల్లో ఆరేళ్లు భారత్‌లో ఉన్నారు.

అవామీ లీగ్‌ పార్టీ అధినేత్రిగా ఎన్నికయ్యాక 1981లో బంగ్లాకు వెళ్లారు. సైన్యం పాలన పోయి ప్రజాస్వామ్యం రావాలని గళమెత్తారు. గృహ నిర్బంధాలను ఎదుర్కొన్నారు. 1991లో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్‌.. బేగం ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్పీ) చేతిలో పరాజయం పాలైంది. 1996లో తొలిసారి గెలిచి ప్రధాని అయ్యారు. 2001లో ఓడిపోయినా 2008 ఎన్నికల్లో గెలిచారు.


ఐరన్‌ లేడీ నుంచి..

హసీనా గత రెండు ఎన్నికల్లో దొడ్డిదారిన ఎన్నికయ్యారన్న విమర్శలొచ్చాయి. భారత్‌, చైనాలతో బలమైన మైత్రీ బంధం ఆమె అధికార పీఠాన్ని పటిష్ఠం చేసినా క్రమేణా బంగ్లావాద భావోద్వేగం పేరిట ప్రత్యర్థులను అణచివేస్తూ ఆస్మదీయులకు పెద్ద పీట వేయడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.

ఓ ర్యాలీలో హసీనాపై 2004లో హత్యాయత్నం జరిగింది. అనంతరం ప్రత్యర్థులను లక్ష్యం గా చేసుకున్నారు. 1971 యుద్ధ నేరాలపై ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యర్థి పార్టీ అగ్రనేతలు కొందరిని దోషులుగా తేల్చింది. 2013లో బీఎన్పీ మిత్రపక్షం జమాత్‌ ఎ ఇస్లామీపై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాకు 17 ఏళ్లు జైలు శిక్ష పడేలా చేశారు.

దీంతో హసీనాను నియంతగా ప్రత్యర్థులు విమర్శించారు. కాగా ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్‌ గెలిచింది. ఆరు నెలలు తిరగకుండానే రిజర్వేషన్ల కోటాపై హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు నేపథ్యంలో అభిమానులు ఐరన్‌ లేడీగా పిలుచుకున్న నాయకురాలు దేశం విడిచి వె ళ్లాల్సివచ్చింది.

Updated Date - Aug 06 , 2024 | 04:20 AM