Bangladesh : బంగ్లాలో కొత్త కరెన్సీ.. మరో 6 నెలల్లో అమల్లోకి..
ABN , Publish Date - Dec 06 , 2024 | 05:03 AM
బంగ్లాదేశ్‌లో మరో 6 నెలల్లో కొత్త కరెన్సీ అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే కొత్త నోట్ల ముద్రణను అక్కడి మధ్యంతర ప్రభుత్వం ప్రారంభించింది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పిలిచే షేక్ ముజీబ్ ఉర్ రహ్మన్ చిత్రం కరెన్సీపై తొలగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల కింద
జాతిపిత ముజీబ్ చిత్రం లేకుండా కొత్త నోట్ల ముద్రణ
ఢాకా, డిసెంబరు 5: బంగ్లాదేశ్‌లో మరో 6 నెలల్లో కొత్త కరెన్సీ అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే కొత్త నోట్ల ముద్రణను అక్కడి మధ్యంతర ప్రభుత్వం ప్రారంభించింది. మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి, బంగ్లా జాతిపితగా పిలిచే షేక్ ముజీబ్ ఉర్ రహ్మన్ చిత్రం కరెన్సీపై తొలగించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల కింద హసీనాపై చేపట్టిన తిరుగుబాటుకు సంబంధించిన చిత్రాలతో పాటు మతపర నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయానికి సంబంధించిన చిత్రాలనూ కొత్త నోట్లపై ముద్రిస్తున్నారు. ముందుగా 20, 100, 500, 1000 నోట్లను ముద్రిస్తున్నామని.. వాటిపై బంగా బంధు షేక్ ముజీబ్ చిత్రం ఉండదని బంగ్లా సెంట్రల్ బ్యాంకు తెలిపింది. వచ్చే 6 నెలల్లో కొత్త కరెన్సీ అమల్లోకి రావచ్చని బంగ్లాదేశ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్నేరా శిఖా వెల్లడించారు.
దాడులపై సమాచారం ఇవ్వండి: యూనస్
బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు మహమ్మద్ యూనస్ స్పందించారు. ముస్లిం, హిందూ, బౌద్ధ, క్రైస్తవ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. దేశంలో జరుగుతున్న దానికి.. విదేశీ మీడియా చూపుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. ఇటు అధికారుల ద్వారా కూడా తమకు కచ్చితమైన సమాచారం అందట్లేదన్నారు. ఏదేమైనా దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులున్నాయని.. మైనార్టీలపై దాడులు జరిగితే ప్రభుత్వం దృష్టికి తేవాలని యూనస్ కోరారు. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని హామీనిచ్చారు. మరోవైపు.. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగాలను ప్రసారం చేయకూడదంటూ బంగ్లాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ) నిషేధం విధించింది. ఆమె చేసే విద్వేషపూరిత ప్రసంగాలను ప్రధాన స్రవంతి మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రసారం చేయకూడదని ఆదేశించింది.