28లోగా రాజీనామా చెయ్యాల్సిందే
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:34 AM
భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని పలువురు లిబరల్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నెల 28లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని
ట్రూడోకు సొంత పార్టీ ఎంపీల అల్టిమేటం
న్యూఢిల్లీ/అట్టావా, అక్టోబరు 24: భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగిలింది. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని పలువురు లిబరల్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నెల 28లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. బుధవారం నిర్వహించిన పార్టీ అంతర్గత భేటీలో అసమ్మతి సభ్యులు గళం విప్పారు. నేరుగా ట్రూడోపై తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్, సెప్టెంబరుల్లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో లిబరల్ పార్టీకి కంచుకోట వంటి రెండు నియోజకవర్గాలను కోల్పోయింది. ట్రూడో నాయకత్వంలో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని సర్వేలు కూడా సూచించాయి. ఈ పరిస్థితికి ట్రూడో వైఖరే కారణమని సమావేశంలో ఎంపీలు మండిపడ్డారు. ట్రూడో రాజీనామా చేయాలంటూ బ్రిటిష్ కొలంబియా ఎంపీ ప్యాట్రిక్ వీలర్ ప్రతిపాదించిన తీర్మానంపై మొత్తం 153 మంది లిబరల్ ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారని, ఈ నెల 28 వరకూ డెడ్‌లైన్ విధించినట్లు సీబీసీ న్యూస్ వర్గాలు తెలిపాయి. ఇది కొంతకాలంగా రగులుతున్న అంశమేనని, ఇప్పటికైనా వారు దీనిని బయటపెట్టడం అవసరమని ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. అయితే ఇదేమంత ఆందోళన చెందాల్సినంత విషయం కాదని, ఈ పరిస్థితులను ట్రూడో సమర్థంగా ఎదుర్కోగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, 2025 అక్టోబరులో జరగబోయే ఎన్నికలకు పార్టీ సన్నాహకాలపైనా ఎంపీలు సంతృప్తిగా లేరు. ట్రూడోకు ప్రజాదరణ క్షీణించడం కూడా వారి అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ 19 పాయింట్ల ఆధిక్యంలో ఉండటంతో రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే ఆందోళనతో ట్రూడో రాజీనామాకు ఎంపీలుడిమాండ్ చేస్తున్నారు.
భారత్‌కు కెనడా వెన్నుపోటు: సంజయ్ వర్మ
ఖలిస్థానీ తీవ్రవాదుల పట్ల కెనడా న్యాయ వ్యవస్థ అతి సున్నితంగా వ్యవహరిస్తూ వారికి తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తోందని ఆ దేశం నుంచి వెనక్కు పిలిపించిన భారత రాయబారి సంజయ్ వర్మ విమర్శించారు. భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినేలా కెనడా వ్యవహరించిందని, ట్రూడో నేతృత్వంలోని ఆ దేశం భారత్‌ను వెన్నుపోటు పొడిచిందన్నారు. నిజ్జర్ హత్య కేసు విచారణ ప్రక్రియను ప్రశ్నించిన ఆయన ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు గోల్డీ బ్రార్ పేరును భారత్ సూచించిన తర్వాత వాంటెడ్ లిస్ట్ నుంచి బ్రార్ పేరు మాయం కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కెనడాలో నివసించే సిక్కుల్లో సుమారు 10వేల మంది మాత్రమే ఖలిస్థానీ మద్దతుదారులు ఉన్నారని, తమ డిమాండ్లను బలంగా వినిపించడం ద్వారా వీరు అక్కడి రాజకీయ పార్టీల దృష్టి ని ఆకర్షిస్తున్నారని తెలిపారు. ఖలిస్థానీలు కెనడాలో మానవ అక్రమ రవాణాకు పాల్పడటంతో పాటు తమ అక్రమ వ్యాపారాల కోసం గురుద్వారాల ద్వారా నిధులు సేకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.