Lunar Water: చాంగే-5 మిషన్‌లో కీలక ఘట్టం.. చంద్రునిపై నీటి ఆనవాళ్లు
ABN , Publish Date - Jul 24 , 2024 | 07:29 PM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు కొన్ని దశాబ్దాల నుంచి చంద్రునిపై రకరకాల ప్రయోగాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ మానవాళి మనుగడ సాధ్యమవుతుందా? భూమిపై ఉన్నట్టే అక్కడా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు కొన్ని దశాబ్దాల నుంచి చంద్రునిపై రకరకాల ప్రయోగాలు (Lunar Missions) చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ మానవాళి మనుగడ సాధ్యమవుతుందా? భూమిపై ఉన్నట్టే అక్కడా సహజ వనరులు లభ్యమవుతాయా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం చంద్రునిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రుని ఉపరితలంపై సల్ఫర్, ఆక్సిజన్‌తో పాటు ఇతర రసాయనాలు ఉన్నాయని చంద్రయాన్-3 సహా ఇతర ప్రాజెక్టులు కనుగొన్నాయి. ఇప్పుడు తాజాగా చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చాంగే-5 సహాయంతో జాబిల్లి నుంచి భూమికి తీసుకొచ్చిన మట్టిని గత నాలుగేళ్ల నుంచి పరిశోధిస్తున్న సైంటిస్టులు.. అందులో నీటి జాడను గుర్తించినట్లు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (సీఏఎస్) స్పష్టం చేసింది.
1000 కంటే ఎక్కువ మినరల్ క్లాస్ట్స్
చంద్రుని నేలపై అధ్యయనం చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు.. 1,000 కంటే ఎక్కువ మినరల్ క్లాస్ట్స్‌లను వేరు చేశారు. వాటిల్లో ‘అజ్ఞాత చంద్రుని మినరల్-1’గా (ULM-1) పిలువబడే ప్లేట్‌లాక్ పారదర్శక క్రిస్టల్‌లో నీటి ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఈ మినరల్.. భూసంబంధమైన వనరులతో గానీ, రాకెట్ ఎగ్జాస్ట్ ద్వారా గానీ కలుషితం అవ్వలేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఓ జియోకెమిస్ట్ మాత్రం ఇక్కడ ఓ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ‘‘నీటి ఆనవాళ్లు కలిగిన ఆ మినరల్ చంద్రుని నమూనాల్లో ఉంటే.. అప్పుడు ఒకటి ఎక్కువ పీసెస్ ఉండాలి కదా’’ అని ప్రశ్నించాడు. ఏదేమైనప్పటికీ.. ప్రస్తుతం నీటి ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్న చైనా శాస్త్రవేత్తలు, అందుకు మరిన్ని ఆధారాలు పొందుపరుస్తారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నాడు. కాగా.. ఈ జియోకెమిస్ట్‌కి ఈ అధ్యయనంతో ఎలాంటి సంబంధం లేదు.
చాంగే-5 ప్రయోగం
చంద్రునిపై మట్టినమూనాలను సేకరించడమే లక్ష్యంగా.. 2020లో చైనా ‘చాంగే-5’ ప్రయోగాన్ని చేపట్టింది. ఆ ఏడాదిలో నవంబర్ 23వ తేదీన దీనిని ‘లాంగ్ మార్చ్ 5’ రాకెట్ ద్వారా అంతరిక్షంలోని లాంచ్ చేయగా.. అది డిసెంబర్ 1వ తేదీన విజయవంతంగా చంద్రునిపై కాలు మోపింది. చంద్రుని ఉపరితలం నుంచి ఆ అంతరిక్ష నౌక దాదాపు 2కిలోల మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ నమూనాలపై బీజింగ్ నేషనల్ లేబొరేటరీ ఫర్ కండెన్స్‌డ్ మ్యాటర్ ఫిజిక్స్, సీఏఎస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి పరిశోధనలు జరుపుతుండగా.. తాజాగా వాటిల్లో స్థాయిలో నీటి అణువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు సీఏఎస్ పేర్కొంది.
మూడో దేశంగా చైనా
చైనా కంటే ముందే అమెరికా, సోవియట్ యూనియన్ జాబిల్లి నుంచి మట్టిని సేకరించారు. తొలుత అమెరికాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు చంద్రునిపైకి వెళ్లి నమూనాలను సేకరించారు. అనంతరం సోవియట్ యూనియన్ 1976లో చంద్రుని మట్టి నమూనాలను భూమికి తీసుకురాగలిగింది. వాటి తర్వాత చంద్రుని నుంచి మట్టి తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఇదిలావుండగా.. 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చంద్రుడిపై నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. అందులో అమర్చిన నాసాకు చెందిన మూన్ మినరాలజీ మ్యాపర్ (M3).. చంద్రునిపై ఉన్న మినరల్స్‌లో నీటి ఆనవాళ్లు ఉన్నాయని నిర్ధారించడంలో సమాయపడింది.
Read Latest International News and Telugu News