Covid 19: శుక్ర కణాలపై కరోనా ఎఫెక్ట్.. తాజా అధ్యయంలో సంచలన విషయాలు
ABN , Publish Date - Jan 25 , 2024 | 01:19 PM
కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది.
బీజింగ్: కరోనా బారిన పడి కోలుకున్న వారిని ఆరోగ్యాన్ని పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వేధిస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకుల బృందం వెలువరించిన ఓ అధ్యయనం సంచలన విషయాలను బయటపెట్టింది. కరోనా.. పురుషుల పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రంగా ప్రభావం చూపించినట్లు అధ్యయనం సారాంశం. 2022 జూన్ నుంచి 2023 జులై మధ్య గిలిన్ పీపుల్స్ అనే ఆసుపత్రిలో 85 మంది పురుషుల వీర్యాన్ని నిపుణులు పరీక్షించారు. వారిలో కరోనా సోకిన వారు ఎక్కువగా ఉన్నారు.
కరోనా(Covid 19) సోకే 6 నెలల ముందు, 3 నెలల్లోపు, కోలుకున్న 3 నెలల తరువాత వారి వీర్యాన్ని పరీక్షించారు. ఈ అధ్యయనంలో కొవిడ్ బారిన పడేకంటే ముందు వీర్యంలో శుక్రకణాల సంఖ్య ఎక్కువగా ఉందని, సోకిన తరువాత వాటి సంఖ్య గణనీయంగా తగ్గిందని నిపుణులు తెలిపారు.
అయితే 6 నెలల తరువాత శుక్రకణాల సంఖ్య సాధారణ స్థితికి వచ్చిందని వివరించారు. 3 దశల్లో తమ పరిశోధన జరిగిందని వెల్లడించారు. అయితే వీర్య నాణ్యతలో సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమే అయినప్పటికీ దీర్ఘ కాలంలో శరీర ఆరోగ్యంపై పడే ప్రభావంపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడ్డారు.