చైనాలో ‘బెబింకా’ తుఫాన్ బీభత్సం!
ABN , Publish Date - Sep 17 , 2024 | 03:47 AM
బెబింకా తుఫాను చైనాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం ఉదయం భారీ టైఫూన్ (తుఫాను) గంటకు 151 కిలోమీటర్ల వేగంతో షాంఘైను తాకడంతో ఈ ఆర్థిక నగరం అతలాకుతలమైంది.
షాంఘై, సెప్టెంబరు 16: బెబింకా తుఫాను చైనాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం ఉదయం భారీ టైఫూన్ (తుఫాను) గంటకు 151 కిలోమీటర్ల వేగంతో షాంఘైను తాకడంతో ఈ ఆర్థిక నగరం అతలాకుతలమైంది. శక్తివంతమైన తుఫాను ధాటికి భీకరమైన గాలులు, భారీ వర్షాలు నగరాన్ని వణికిస్తున్నాయి. దీంతో 2.5 కోట్ల జనాభా ఉన్న షాంఘై మహా నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఇక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. 75 ఏళ్ల క్రితం (1949లో) గ్లోరియా టైఫూన్ తర్వాత షాంఘైను తాకిన అత్యంత బలమైన తుఫాను బెబింకానేనని చైనా వాతావరణ నిపుణులు తెలిపారు. షాంఘైలోని రెండు విమానాశ్రయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి వందలాది విమానాలను రద్దు చేశారు. కొన్ని రైలు సర్వీసులను కూడా నిలిపివేశారు.