Share News

Dhaka : బంగ్లా సీజే రాజీనామా

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:54 AM

బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, 65 ఏళ్ల జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు.

 Dhaka : బంగ్లా సీజే రాజీనామా

  • ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్‌ హసన్‌ కేంద్రంగా ఢాకాలో విద్యార్థుల ఆందోళన

  • సుప్రీంకోర్టును చుట్టుముట్టి నిరసన

  • గంట వ్యవధిలో రాజీనామాకు పట్టు

  • షేక్‌ హసీనాకు విధేయుడిగా ముద్ర

  • తాత్కాలిక సీజేగా అష్ఫఖుల్‌ నియామకం

  • షేక్‌ హసీనాకు విధేయుడిగా ముద్ర

ఢాకా/వాషింగ్టన్‌, ఆగస్టు 10: బంగ్లాదేశ్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, 65 ఏళ్ల జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ తన పదవికి రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌తో భేటీ అయిన ఆయన పలు అంశాలపై చర్చించిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఆయనకు సమర్పించారు. ఆయన స్థానంలో బంగ్లా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా అప్పిలేట్‌ డివిజన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ మొహమ్మద్‌ అష్ఫఖుల్‌ ఇస్లాం నియమితులయ్యారు. దీనికి ముందు శనివారం ఉదయం జస్టిస్‌ హసన్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమావేశం కావాలని నిర్ణయించారు.

ఈ విషయం తెలిసిన విద్యార్థులు.. ఈ భేటీకి తాత్కాలిక ప్రభుత్వ అనుమతి లేదని, న్యాయవ్యవస్థ కుట్ర చేస్తోందని భావించి.. ఆందోళనకు పిలుపునిచ్చారు. జస్టిస్‌ హసన్‌ సహా ఇతర న్యాయమూర్తులు కేవలం గంట వ్యవధిలో రాజీనామా చేయాలని అల్టిమేటమ్‌ జారీ చేయడంతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు అనూహ్యంగా ఆందోళనకు దిగారు.

క్షణాల వ్యవధిలో వందలాదిగా పోగైన విద్యార్థులు సుప్రీంకోర్టును చుట్టుముట్టి హసన్‌ రాజీనామా చేసి వెళ్లిపోవాలని నినాదాలతో హోరెత్తించారు. దీంతో జస్టిస్‌ హసన్‌ తన సమావేశాన్ని వాయిదా వేశారు. అయినప్పటికీ విద్యార్థులు శాంతించకపోవడంతో రాజీనామాకు అంగీకరించారు.


కాగా, గత ఏడాది ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ హసన్‌ షేక్‌ హసీనాకు విధేయుడిగా ముద్రపడ్డారు.బంగ్లాదేశ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అబ్దుర్‌ రవూఫ్‌ తలుక్దెర్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు.

అయితే, ఈ పదవికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి రాజీనామాను అంగీకరించలేదని ఆర్థిక శాఖ సలహాదారు సలేహుద్దీన్‌ అహ్మద్‌ తెలిపారు. కాగా, బంగ్లా పోలీసు సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశంలో పరిస్థితి సర్దుమణిగే వరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పాయి. మరోవైపు దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయని హిందూ సంఘాలు ఆరోపించాయి.

ఈ నెల 5 నుంచి ఇప్పటి వరకు 52 జిల్లాల్లో 205 దాడులు జరిగినట్టు తెలిపాయి. తమకు రక్షణ కల్పించాలని మైనారిటీలు కోరుతున్నట్టు సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ దాడులకు నిరసనగా వేలాది మంది బంగ్లాదేశ్‌ హిందువులు ఢాకాతో పాటు పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిపారు.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు. మరోవైపు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అమెరికా జోక్యం చేసుకోవాలని భారతీయ అమెరికన్‌ చట్ట సభ సభ్యులు రాజా కృష్ణమూర్తి, శ్రీ తానేదార్‌లు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు.

Updated Date - Aug 11 , 2024 | 04:54 AM