Share News

Attack On Trump: దేవుడు నా వైపు ఉన్నాడు: హత్యాయత్నంపై తొలిసారి ట్రంప్ స్పందన

ABN , Publish Date - Jul 19 , 2024 | 09:05 AM

ఇటీవల తనపై జరిగిన హత్యాయత్నంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలిసారి మాట్లాడారు.

Attack On Trump: దేవుడు నా వైపు ఉన్నాడు: హత్యాయత్నంపై తొలిసారి ట్రంప్ స్పందన
Donald Trump

ఇటీవల తనపై జరిగిన హత్యాయత్నంపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలిసారి మాట్లాడారు. ‘‘నా ప్రాణాలను దైవమే కాపాడింది. దేవుడు నావైపు ఉన్నాడు. దైవ అడ్డుపడడంతోనే ప్రాణాలతో బయటపడ్డాను. లేదంటే ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండేవాడిని కాదేమో’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి లాంఛనంగా అంగీకారం తెలిపేందుకు మిల్వాకీలో గురువారం జరిగిన ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌’లో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఈ రాత్రి ఎంతో విశ్వాసం, భక్తితో అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా మీ(పార్టీ సభ్యులు) నామినేషన్‌ను నేను గర్వంగా అంగీకరిస్తున్నాను’’ అని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై జరిగిన హత్యాయత్నాన్ని గుర్తుచేసుకున్నారు.


ఆ సమయంలో చార్ట్ చూస్తున్నాను..

‘‘నేను ఈ రోజు మీ ముందు నిలబడ్డానంటే ఆ దేవుడి దయే. నేను కాస్త పక్కకు వాలడంతోనే బుల్లెట్ తగల్లేదు. స్ర్కీన్ మీద ప్రదర్శించిన ఇమ్మిగ్రేషన్ డేటా చూసేందుకు కాస్త తల వాల్చాను. కాల్పుల సమయంలో చార్ట్ చూసేందుకు కుడివైపునకు తల తిప్పుతూ ఉన్నాను. అదే నా అదృష్టమైంది. నేను చాలా చాలా అదృష్టవంతుడిని’’ అని ట్రంప్ పేర్కొన్నారు.


కాగా ‘రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్’లో డొనాల్డ్ ట్రంప్ పొడియం వద్దకు వెళ్తున్న సమయంలో అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించారు. తద్వారా ట్రంప్ తన దేశభక్తిని చాటుకున్నారని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. కాగా ట్రంప్ మాట్లాడుతున్నంత సేపు రిపబ్లికన్ పార్టీ శ్రేణులు కరతాళ ధ్వనులతో సభాప్రాంగణాన్ని మార్మోగించాయి. పెన్సిల్వేనియాలో హత్యాయత్నం ఘటనలో బాధితుల కోసం పార్టీ 6.3 మిలియన్ డాలర్లు సేకరించిందని ట్రంప్ ప్రకటించారు. ఈ దాడిలో ట్రంప్‌ మద్దతుదారుడైన కోరీ కాంపెరేటోర్‌ అనే వ్యక్తి మరణించగా మరో ఇద్దరు ఇద్దరు గాయపడ్డారు. వారికి ఈ విరాళాలను అందించనున్నారు.

Updated Date - Jul 19 , 2024 | 09:10 AM