Donald Trump: రూ.692 కోట్లు చెల్లించాల్సిందేనంటూ ట్రంప్‌కు భారీ జరిమానా.. ఎందుకో తెలుసా?
ABN , Publish Date - Jan 27 , 2024 | 05:03 PM
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. రచయిత జీన్ కారోల్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో.. ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692 కోట్లు పైనే) చెల్లించాలని న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. రచయిత జీన్ కారోల్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో.. ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.692 కోట్లు పైనే) చెల్లించాలని న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఆమె పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను 18.9 మిలియన్ డాలర్లు నష్టపరిహారంగా ఇవ్వాలని.. అలాగే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా ఉండేందుకు మరో 65 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది.
కేవలం మూడు గంటలలోపే జ్యూరీ చర్చలు జరిపి.. ఈ నిర్ణయానికి వచ్చింది. ఈ కేసు విచారణ జరుగుతున్నంతసేపు కోర్టులోనే ఉన్న ట్రంప్.. సరిగ్గా తీర్పు ఇచ్చే సమయంలో ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. ‘ఇది అమెరికా కాదు’ అని చెప్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ తీర్పు విన్న తర్వాత తాను దీనిని హైకోర్టులో అప్పీల్ చేస్తానని చెప్పారు. ‘‘ఈ తీర్పు హాస్యాస్పదం. నేను దీనిని హైకోర్టులో అప్పీల్ చేస్తాను. మన న్యాయ వ్యవస్థ నియంత్రణ కోల్పోయింది. దీనిని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు’’ అని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
అసలేంటి ఈ కేసు?
1996లో మాన్‌హటన్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ట్రంప్ తనకు పరిచయం అయ్యారని కారోల్ తెలిపారు. కాసేపు తమ మధ్య సరదా సంభాషణ సాగిందని, అప్పుడు వేరే మహిళలకు లోదుస్తులను బహుమతిగా ఇవ్వాలని ఆయన తనతో మాట కలిపారని చెప్పారు. దానిని తాను ఒక జోక్‌గా తీసుకున్నానని అన్నారు. అయితే.. కాసేపయ్యాక ట్రంప్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపణలు చేశారు. దాంతో తాను షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. తనని తాను అత్యాచార బాధితురాలిగా చూసుకోవడం ఇష్టం లేక.. తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు.
తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి కారోల్ కొన్ని సంవత్సరాల తర్వాత తాను రాసిన ఒక పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ వివరాలను న్యూయార్క్ మ్యాగజైన్ 2019లో ప్రచురించింది. అది చూసిన ట్రంప్.. కారోల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన రచనలు మార్కెట్‌లో బాగా అమ్ముడుపోవాలన్న ఉద్దేశంతోనే ఆమె తనపై అసత్య ఆరోపణలు చేశారని ట్రంప్ విమర్శించారు. దీంతో.. కారోల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన పరువుకి నష్టం కలిగేలా ట్రంప్ వ్యాఖ్యలు చేశారని, తనకు 10 మిలియన్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోరారు.
దీనిపై విచారణ జరిపిన మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు.. ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు చెల్లించాలని పైవిధంగా తీర్పునిచ్చింది. అంతకుముందు కారోల్‌ను ట్రంప్ లైంగికంగా వేధించారని నిర్ధారించిన కోర్టు.. అందుకు గాను 5 మిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.