Share News

ట్రంప్‌ కార్యవర్గంలో బిలియనీర్లు

ABN , Publish Date - Dec 12 , 2024 | 05:26 AM

మధ్యతరగతి అమెరికన్లను రక్షిస్తాం.. సాధారణ అమెరికా పౌరుల కోసం పోరాడతాం.. అని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పారు.

ట్రంప్‌ కార్యవర్గంలో బిలియనీర్లు

అందరి సంపద కలిపి 382 బిలియన్‌ డాలర్లు

172 దేశాల జీడీపీ కన్నా వారి ఆస్తి ఎక్కువ

వాషింగ్టన్‌, డిసెంబరు 11: మధ్యతరగతి అమెరికన్లను రక్షిస్తాం.. సాధారణ అమెరికా పౌరుల కోసం పోరాడతాం.. అని ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఆ మధ్యతరగతి కోసం తన కార్యవర్గంలోకి అపర కుబేరులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు తన కార్యవర్గంలోకి బిలియనీర్లు అయిన ఎలాన్‌ మస్క్‌, వివేక్‌ రామస్వామి, లిండా మెక్‌మహోన్‌, హోవార్డ్‌ లుట్నిక్‌, డగ్‌ బర్గుమ్‌, స్కాట్‌ బెసెంట్‌, జారెడ్‌ ఐజాక్‌మన్‌, స్టీవెన్‌ విట్కాఫ్‌, వారెన్‌ స్టీఫెన్స్‌లను తీసుకున్నారు. ప్రస్తుతం వీరి మొత్తం ఆస్తి విలువ సుమారు 382.2 డాలర్లు. అంటే దాదాపు రూ. 32 లక్షల కోట్లు. ఇది ఎంత పెద్ద సంపద అంటే.. ప్రపంచంలో 172 దేశాలకు అంత జీడీపీ కూడా లేదు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కేబినెట్‌లోని వారి మొత్తం సంపద 118 మిలియన్‌ డాలర్లు. అయితే గతంలో ట్రంప్‌ కేబినెట్‌ మొత్తం ఆస్తి విలువ 6.2 బిలియన్‌ డాలర్లు మాత్రమే అని ఫోర్బ్స్‌ వెల్లడించింది.


ట్రంప్‌ కార్యవర్గంలోకి కుబేరులు

ఎలాన్‌ మస్క్‌: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీకి అధిపతిగా ప్రపంచ కుబేరుడు మస్క్‌ను ట్రంప్‌ ఎంపిక చేసుకున్నారు. మస్క్‌ ప్రస్తుత సంపద మొత్తం 363.3 బిలియన్‌ డాలర్లు.

వారెన్‌ స్టీఫెన్స్‌: బ్రిటన్‌లో అమెరికా రాయబారిగా స్టీఫెన్స్‌ను ట్రంప్‌ ఎంపిక చేశారు. వారసత్వంగా వచ్చిన ఆర్థిక సేవల కంపెనీ స్టీఫెన్స్‌ ఇన్‌కార్పోరేషన్‌కు అధిపతి వారెన్‌ స్టీఫెన్స్‌. అతని మొత్తం ఆస్తి 3.4 బిలియన్‌ డాలర్లు.

లిండా మెక్‌మహోన్‌: ప్రపంచ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మెక్‌మహోన్‌ కో ఫౌండర్‌. లిండాకు విద్యాశాఖ పగ్గాలు అప్పగించే అవకాశముంది. మెక్‌మహోన్‌ కుటుంబం సంపద 3 బిలియన్‌ డాలర్లు.

జారెడ్‌ ఐజాక్‌మన్‌: నాసా అధిపతిగా ఐజాక్‌మన్‌ను ట్రంప్‌ ఎంపిక చేశారు. మస్క్‌కు సన్నిహితుడైన ఆయన స్పేస్‌ ఎక్స్‌లో పెట్టుబడి పెట్టారు. ఐజాక్‌మన్‌ మొత్తం ఆస్తి విలువ 1.7 బిలియన్‌ డాలర్లు.

హోవార్డ్‌ లుట్నిక్‌: కేంటర్‌ పిట్జ్‌గెరాల్డ్‌ అనే ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంక్‌కు హోవార్డ్‌ అధిపతి. కామర్స్‌ సెక్రటరీగా ట్రంప్‌ అవకాశం ఇచ్చారు. లుట్నిక్‌ మొత్తం ఆస్తి విలువ 1.5 బిలియన్‌ డాలర్లు.

వివేక్‌ రామస్వామి: మస్క్‌తో పాటు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీని లీడ్‌ చేసే అవకాశం వివేక్‌కు ట్రంప్‌ ఇచ్చారు. ఆయన మొత్తం ఆస్తి విలువ ఒక బిలియన్‌ డాలర్లు.

స్టీవెన్‌ విట్కాఫ్‌: మధ్యప్రాచ్యానికి ప్రత్యేక రాయబారిగా విట్కా్‌ఫను ట్రంప్‌ ఎంపిక చేశారు. ఫ్లోరిడాలో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారుడైన విట్కాఫ్‌ మొత్తం సంపద విలువ ఒక బిలియన్‌ డాలర్లు.

Updated Date - Dec 12 , 2024 | 05:26 AM