Share News

Luxury Coffee, Tea: ఆ చాయ్‌కు పెట్టే డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు.. ఒక్కోటి ఎంతంటే

ABN , Publish Date - Dec 16 , 2024 | 04:33 AM

సాధారణంగా ఒక టీ ఖరీదు రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. అదే పెద్ద హోటల్‌లో అయితే రూ.80 నుంచి రూ.200 వరకు ఉంటుంది. కానీ ఈ టీ మాత్రం లక్షల్లో ఖరీదు చేస్తోంది. ఈ చాయ్‌కు పెట్టే డబ్బులతో ఓ ఫ్యామిలీ ఇల్లు కట్టుకోవచ్చు

Luxury Coffee, Tea: ఆ చాయ్‌కు పెట్టే డబ్బులతో ఇల్లు కట్టుకోవచ్చు.. ఒక్కోటి ఎంతంటే

కాఫీ అయితే రూ.1.09 లక్షలు

ఆ హోటల్‌ భారతీయులదే

దుబాయ్‌, డిసెంబరు 15: ‘లక్షాఽధికారైన లవణం, అన్నమెగానీ మెరుగు బంగారంబు మింగబోడు’.. ఇదో సత్తికాలం నాటి మాట. ఇప్పుడు దుబాయ్‌ వెళ్తే నిజంగానే బంగారం తినొచ్చు. బంగారం కాఫీ, బంగారం టీ కూడా తాగొచ్చు. ‘గోల్డ్‌ కడక్‌ టీ’ 5000 దిర్హామ్‌లు (రూ1.14 లక్షలు) పలుకుతోంది. ఎమిరేట్స్‌ ఫైనాన్సియల్‌ టవర్స్‌లో ఏర్పాటు చేసిన బోహో కేఫ్‌లో ఇవన్నీ దొరుకుతాయి. దీని యజమాని సుచేత శర్మ అనే భారతీయ మూలాలు ఉన్న మహిళే. ఇక్కడ గోల్డ్‌ చాయ్‌ ఆర్డర్‌ చేస్తే.. దానిపై 24 క్యారెట్ల మేలిమి బంగారం పొడి చల్లి, వెండి కప్పుల్లో ఇస్తారు. దీంతోపాటుగా ‘క్రోయిస్సాంట్‌’ అనే ఫ్రెంచ్‌ వంటకాన్ని కూడా వెండి పళ్లెంలో ఇస్తారు.

దీనిపైనా బంగారం పొడి చల్లుతారు. చివర్లో ఈ కప్పులు, పళ్లేలను వినియోగదారులు తీసుకెళ్లిపోవచ్చు. ఈ రాయల్‌ మెనూలో ‘గోల్డ్‌ సావరిన్‌ కాఫీ’ కూడా ఉంది. దీని ధర 4,761 దిర్హామ్‌లు (రూ.1,09 లక్షలు). దీన్ని కూడా వెండి కప్పుల్లో ఇస్తారు. ఆ కప్పులను కూడా ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఇవి కాకుండా బంగారం ఐస్‌క్రీమ్‌లు, డ్రింకులు కూడా లభిస్తాయి. ‘విలాసాలు కోరుకునే వారికి ఏదైనా అసాధారణమైనది చేయాలనుకున్నాం. అందుకే వీటిని అందిస్తున్నాం’ అని సుచేత శర్మ చెప్పారు. వీటితో పాటుగా అందరికీ అందుబాటులో ఉండే భారతీయ స్ట్రీట్‌ ఫుడ్‌ కూడా తమ హోటల్‌లో దొరుకుతుందని తెలిపారు.

Updated Date - Dec 16 , 2024 | 11:25 AM