Share News

ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడికి హమాస్‌ కుట్ర

ABN , Publish Date - Oct 14 , 2024 | 06:23 AM

ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7 దాడికి ముందే హమాస్‌ 9/11 తరహా భారీ దాడికి కుట్ర పన్నిందని ఆధారాలు లభించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. పాలస్తీనా ఖాన్‌ యూనిస్‌ లోని

ఇజ్రాయెల్‌పై 9/11 తరహా దాడికి హమాస్‌ కుట్ర

అక్టోబరు 7కు ముందే జరపాలని పథకం!

వాషింగ్టన్‌, అక్టోబరు 13: ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7 దాడికి ముందే హమాస్‌ 9/11 తరహా భారీ దాడికి కుట్ర పన్నిందని ఆధారాలు లభించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. పాలస్తీనా ఖాన్‌ యూనిస్‌ లోని హమాస్‌ కమాండ్‌ సెంటర్‌ నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు స్వాధీనం చేసుకున్న కీలక పత్రాల్లో దాడికి కుట్ర వివరాలు బయటపడ్డాయి. ఐడీఎఫ్‌ బలగాలు అందించిన పత్రాలు, ఇతర ఆధారాలతో న్యూయార్క్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ తదితర అంతర్జాతీయ మీడియా సంస్థలు హమాస్‌ కుట్రకు సంబంధించి తాజా కథనాలు ప్రచురించాయి. దాడి కోసం 2022 జనవరి నుంచి 2023 ఆగస్ట్‌ వరకూ హమాస్‌ రాజకీయ, సైనిక విభాగాలు పది ఉన్నత స్థాయి సమావేశాలు జరిపి ఇరాన్‌ నుంచి ఆర్థిక మద్దతు, సైనిక సాయం కోరాయి. టెల్‌ అవీవ్‌లోని బహుళ అంతస్థుల అజ్రెయిలీ టవర్స్‌ను కూల్చేయాలనేది హమాస్‌ అసలు కుట్ర. దీనికి సంబంధించి ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీతో పాటు ఐఆర్‌జీసీ చీఫ్‌ ఖానీ ఇతర ఇరాన్‌ కీలక నేతలతో హమాస్‌ నేత యాహ్యా సిన్వార్‌ చర్చలు కూడా జరిపాడు. ఇరాన్‌, హెజ్‌బుల్లాల నుంచి అదనపు ఆర్థిక మద్దతు, సైనిక సాయం అందే విషయంలో ఆలస్యం కావడంతో హమాస్‌ కుట్రను అమలు చేయలేక విరమించుకుంది. చివరకు వ్యూహాన్ని మార్చుకుని ఇజ్రాయెల్‌లో అంతర్గత పరిస్థితులు సరిగా లేని తరుణం చూసి 2023 అక్టోబర్‌ 7న భీకర దాడికి పాల్పడింది. 12 వందల మందిని చంపేయడంతో పాటు 250 మంది ఇజ్రాయెలీలను బందీలుగా తీసుకువెళ్లింది. కాగా, గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన తాజా దాడుల్లో 50 మంది చనిపోయారు.

Updated Date - Oct 14 , 2024 | 06:23 AM