Share News

హెజ్‌బొల్లాను ముంచిన కమాండర్‌ పెళ్లిళ్ల లొల్లి!

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:07 AM

హెజ్‌బొల్లా సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫాద్‌ షుక్ర్‌.. పెళ్లిళ్ల గోల చివరకు ఆ సంస్థ పతనానికే దారి తీసింది.

హెజ్‌బొల్లాను ముంచిన కమాండర్‌ పెళ్లిళ్ల లొల్లి!

బీరుట్‌, డిసెంబరు 30: హెజ్‌బొల్లా సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఫాద్‌ షుక్ర్‌.. పెళ్లిళ్ల గోల చివరకు ఆ సంస్థ పతనానికే దారి తీసింది. ఏళ్లుగా అండర్‌గ్రౌండ్‌లోనే తలదాచుకున్న అతడు.. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా నలుగురు మహిళలను పెళ్లి చేసుకోవాలని తలంచి ఆ ప్రయత్నంలోనే ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొస్సాద్‌ చేతిలో హతమయ్యాడు. ఇది జరిగిన కొద్ది వారాల వ్యవధిలోనే హెజ్‌బొల్లా కీలక నేతలను ఇజ్రాయెల్‌ మట్టుబెట్టింది. 1983లో లెబనాన్‌లోని బీరుట్‌లో అమెరికన్‌ మెరైన్‌ బ్యారక్‌లపై దాడులు చేసి 238 అమెరికన్‌ సైనికులను చంపిన ఘటన వెనకాల వ్యూహకర్తల్లో షుక్ర్‌ ఒకడు.. 1985లో టీడబ్ల్యూఏ ఫ్లైట్‌ హైజాక్‌లోనూ అతడిది కీలక పాత్ర.. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలోనే నలుగురు మహిళలతో ఏకకాలంలో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. 2024 వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే తాను చేసింది తప్పన్న భావన అతడిని వెంటాడింది. దీంతో హెజ్‌బొల్లాలో అత్యున్నత మత గురువైన హషీమ్‌ సఫీద్దీన్‌ సంప్రదించి జరిగిందంతా చెప్పుకొన్నాడు. ఆ నలుగురిని పెళ్లి చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని.. ఈ తతాంగమంతా ఫోన్‌లోనే జరిగిపోవాలని సఫీద్దీన్‌ సలహా ఇచ్చాడు. ఆ నలుగురు మహిళలు ఎక్కడెక్కడో ఉన్నా గానీ ఫోన్‌ కాల్స్‌లోనే పెళ్లిళ్లు జరిపించాడు. మరోవైపు.. 2006 నుంచే షుక్ర్‌ కోసం వెతుకుతున్న మొస్సాద్‌కు ఈ విషయం తెలిసింది. ఈ క్రమంలోనే బీరుట్‌లోని ఓ పాత భవనంలో అతడు ఉన్నట్లు గుర్తించింది. జూలై 30వ తేదీన పక్కా ప్లాన్‌తో ఓ వ్యక్తి నుంచి అతడికి ఫోన్‌ చేయించి భవనం పై అంతస్తుకు రప్పించి.. క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో షుక్ర్‌తో పాటు అతడి భార్య, ఇద్దరు చిన్నారులు మరణించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా బాంబు దాడిలో చనిపోయాడు.

Updated Date - Dec 31 , 2024 | 04:07 AM