Share News

Canada: కెనడాలో భారతీయులపై అరాచకం.. రెచ్చిపోయిన ఖలిస్తానీ శక్తులు

ABN , Publish Date - Nov 04 , 2024 | 11:42 AM

కెనడాలో మరోసారి ఖలిస్తానీ శక్తులు విధ్వంసానికి తెరతీశాయి. భారత్ కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనల్లో పలువురిపై దాడికి దిగారు. రోడ్లపై తరుముతూ కర్రలతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Canada: కెనడాలో భారతీయులపై అరాచకం.. రెచ్చిపోయిన ఖలిస్తానీ శక్తులు
Kalisthani group

ఒట్టావా: కెనడాలో మరోసారి భారత వ్యతిరేక శక్తులు అరాచకం సృష్టించాయి. భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతు దారులు ప్రదర్శన చేపట్టారు. ఇండియాకు మద్దతుగా నిలిచిన వారిపై దాడులకు దిగారు. ఆదివారం కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న హిందూ దేవాలయానికి వచ్చిన వారిపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేశారు. దాడి చేసిన వారి చేతుల్లో ఖలిస్తాన్ జెండాలు ఉన్నాయి. ఆలయంలో ఉన్న వారిపై కర్రలతో దాడికి తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


స్పందించిన కెనడా ప్రధాని..

ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ‘‘బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో ఈరోజు జరిగిన హింసను మేం అంగీకరించబోం. ప్రతి కెనడియన్‌కు తన మతాన్ని స్వేచ్ఛగా , సురక్షితంగా ఆచరించే హక్కు ఉంది’’ అని ట్రూడో తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. ప్రజలు సంయమనం పాటించాలని పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైప్ప విజ్ఞప్తి చేశారు.


భారత్ ఆందోళన..

కెనడాలోని హిందూ దేవాలయంలో జరిగిన విధ్వంసం, దాడి ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత హైకమిషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.

టొరంటో సమీపంలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వద్ద భారత వ్యతిరేక శక్తులు 'ఉద్దేశపూర్వక' హింసకు పాల్పడ్డాయని భారత హైకమిషన్ పేర్కొంది. భారతీయ పౌరుల భద్రత అంశంలో ఇదెంతో ఆందోళన కలిగించే విషయమని అన్నారు.


దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు..

ప్రతిపక్ష నాయకుడు పియర్రె పొయిలీవ్రే దాడిపై స్పందిస్తూ.. ‘‘ఇటువంటి దాడులు ఆమోదయోగ్యం కాదు. కెనడియన్లందరూ శాంతియుతంగా తమ మతాన్ని ఆచరించాలి’’ అని పిలుపునిచ్చారు.

బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ.. ‘‘కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక విలువ. ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండగలగాలి. ప్రార్థనా స్థలం వెలుపల ఎలాంటి హింసనైనా మేం తీవ్రంగా ఖండిస్తాము. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసకు పాల్పడిన వారిని శిక్షించేందుకు పోలీసులు తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు.


నేపియన్ ఎంపీ చంద్ర ఆర్య ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ ఖలిస్తానీ తీవ్రవాదులు సరిహద్దు దాటి కెనడాలో భీకర హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. ఆలయంలో భక్తులపై ఖలిస్తానీలు జరిపిన దాడి కెనడాలో తీవ్రవాదం ఎంతగా విజృంభిస్తుందో తెలియజేస్తోంది. ఖలిస్తాన్ తీవ్రవాదులకు వాక్ స్వాతంత్య్రం కింద స్వేచ్ఛ లభించిందని ఎంపీ అన్నారు. హిందూ-కెనడియన్లు తమను తాము రక్షించుకోవడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి ముందుకు రావాలి. తమ నేతలపై ఒత్తిడి తీసుకురావాల్సి సమయమిదని పిలుపునిచ్చారు.

ఖలిస్తానీ మద్దతుదారుల గురించి హిందువులు, భారతీయులు ఆందోళన చెందుతున్నారు. కెనడాలోని హిందూ దేవాలయాలు, కమ్యూనిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం గురించి భారతీయ సమాజం కొంతకాలంగా ఆందోళన చెందుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రేటర్ టొరంటో ఏరియా, బ్రిటిష్ కొలంబియా, కెనడాలోని ఇతర ప్రాంతాలలో హిందూ దేవాలయాలు ధ్వంసం అవుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి

Updated Date - Nov 04 , 2024 | 01:45 PM