అమెరికాలో హెలెన్ బీభత్సం
ABN , Publish Date - Sep 29 , 2024 | 04:09 AM
అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో హెలెన్ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను ధాటికి ఐదు రాష్ట్రాల్లో దాదాపు 52 మంది చనిపోగా అపారమైన ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
విరుచుకుపడిన కేటగిరి 4 హరికేన్
52 మంది మృతి, అంధకారంలో 30 లక్షల మంది
పెర్రీ, సెప్టెంబరు 28: అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో హెలెన్ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. తుఫాను ధాటికి ఐదు రాష్ట్రాల్లో దాదాపు 52 మంది చనిపోగా అపారమైన ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం రాత్రి ఫ్లోరిడాలోని బిగ్‌బెండ్ ప్రాంతంలో మొదలైన కేటగిరి 4 హరికేన్ భీకర గాలులతో విరుచుకుపడింది. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. జార్జియా, కరోలినా, టెన్నెస్సీ గుండా సాగిన హెలెన్ ధాటికి అనేక వృక్షాలు నేల కూలగా, జనావాసాలు చెల్లాచెదురయ్యాయి. కొండచరియలు విరిగిపడటం, తీవ్ర స్థాయిలో వరద ముంచెత్తడంతో కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందమయ్యాయి. విద్యుత్ సరాఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో దాదాపు 30 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. ఫ్లోరిడా, జార్జియా, ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియాలో ఎక్కువగా మరణాలు సంభవించాయి. అట్లాంటాలో రికార్డు స్థాయిలో 28 సెంమీల వర్షపాతం నమోదైంది.