Share News

India vs Pakistan: మరోసారి పాక్ అక్కసు.. స్ట్రాంగ్ కౌంటర్‌తో బుద్ధి చెప్పిన భారత్

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:29 PM

ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan).. తమ దేశ పరిస్థితుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా భారత్‌పై (India) విషం కక్కడమే పనిగా పెట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ని దోషిగా నిలబెట్టేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలు ప్రతిసారి బెడిసికొడుతున్నా, తీరు మార్చుకోకుండా పాక్ అదే వైఖరి కనబరుస్తోంది.

India vs Pakistan: మరోసారి పాక్ అక్కసు.. స్ట్రాంగ్ కౌంటర్‌తో బుద్ధి చెప్పిన భారత్

ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan).. తమ దేశ పరిస్థితుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా భారత్‌పై (India) విషం కక్కడమే పనిగా పెట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ని దోషిగా నిలబెట్టేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలు ప్రతిసారి బెడిసికొడుతున్నా, తీరు మార్చుకోకుండా పాక్ అదే వైఖరి కనబరుస్తోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో (United Nations Human Rights Council) జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) అంశాన్ని లేవనెత్తి.. భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేసింది. అయితే.. పాక్‌కు ఈసారి కూడా భంగపాటు తప్పలేదు. ముందు మీ దేశంలోని పరిస్థితుల్ని చక్కబెట్టుకోండంటూ.. దాయాదికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.


జెనీవాలో ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా.. పాకిస్తాన్‌, టర్కీ (Turkey) దేశాలు జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తాయి. ఆ ప్రాంతంలో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని ఆరోపణలు చేశాయి. ఈ ఆరోపణలపై ‘రైట్‌ టు రిప్లై’ అవకాశం కింద భారత కార్యదర్శి అనుపమ సింగ్‌ స్పందిస్తూ.. పాక్‌ తీరును ఎండగట్టారు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేసేందుకు పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని, ఇది నిజంగా దురదృష్టకరమని మండిపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్ధాఖ్‌లు భారత్ అంతర్భాగాలని.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్‌కు లేదని ఉద్ఘాటించారు. 2023 ఆగస్టులో పాక్‌లోని జరన్‌వాలాలో మైనార్టీలపై దాడులు జరిగాయని.. 19 చర్చీలను తగలబెట్టడంతో పాటు 89 క్రిస్టియన్‌ నివాసాలను కాల్చివేశారని.. అలాంటి వారు మానవహక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

పాకిస్తాన్ ప్రోత్సాహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని.. వారి రక్తంతో పాక్ తడిసిపోయిందని అనుపమ విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ఆ దేశ ప్రభుత్వం విఫలమైందని, అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని ఆమె ధ్వజమెత్తారు. తన సొంత మైనార్టీలపై హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్.. ఆర్థిక పురోగతి, సామాజిక న్యాయాన్ని సాధిస్తున్న భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడం, ఆ దేశం వక్రబుద్ధికి నిదర్శనమని అన్నారు. ఇదే సమయంలో టర్కీపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌ మాటలకు వంతపాడుతూ టర్కీ కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరమన్న ఆమె.. భవిష్యత్తులో ఇలా జరగకుండా వాళ్లు దూరంగా ఉంటారని విశ్వసిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Updated Date - Feb 29 , 2024 | 05:29 PM